వారంలోగా జూరాలకు కృష్ణమ్మ జలాలు

వారంలోగా జూరాలకు కృష్ణమ్మ జలాలు
  •     ఎల్లుండికల్లా నిండే అవకాశం
  •     కర్నాటకలో భారీ వర్షాలతో జలకళ
  •     వెలవెలబోతున్న గోదావరి ప్రాజెక్టులు
  •     ఎల్లంపల్లి మినహా అన్నీ డెడ్​ స్టోరేజీలోనే

హైదరాబాద్‌, వెలుగు: కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాజెక్టులు నిండుతుండటంతో వారంలోగా జూరాలకు కృష్ణా జలాలు వచ్చే అవకాశముంది. ఆల్మట్టి నిండుకుండను తలపిస్తుండగా నారాయణ్​పూర్‌కు భారీ వరద వస్తోంది. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో లేదు. గోదావరి ఉప నది ప్రాణహితలో మాత్రమే ఒక టీఎంసీకి మించి వరద కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసేయడంతో ప్రాణహిత నీళ్లతో కాళేశ్వరం ప్రాంతం గోదావరి నీటితో కళకళలాడుతోంది.

ఆల్మట్టికి రోజూ లక్ష క్యూసెక్కులు

ఆల్మట్టిలోకి సోమవారం 1,11,560 క్యూసెక్కుల వరద వచ్చింది. ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి 101.39 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. పవర్‌ హౌస్‌లోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 33 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గురువారం రాత్రికి ఆల్మట్టి పూర్తిగా నిండే అవకాశముంది. నారాయణపూర్‌ సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ 25.83 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. జలాశయంలోకి 42,453 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నారాయణపూర్‌ గురువారం ఉదయానికి నిండే అవకాశముంది. ఆ రోజే నారాయణపూర్‌ గేట్లు ఎత్తినా వారంలోగా జూరాలకు కృష్ణా జలాలు చేరే చాన్స్​ ఉంది. తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 12.30 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి కేవలం 70 క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయం కెపాసిటీ 215.81 టీఎంసీలకు ప్రస్తుతం 31.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్‌లోకి 1,178 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 312.05 టీఎంసీలకు 126.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గోదావరి బేసిన్వెలవెల

గోదావరి బేసిన్‌లో ప్రధాన ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. గోదావరి ఉపనది ప్రాణహితలో వస్తోన్న వరదతో కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ వద్ద 10,700 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. బ్యారేజీ 85 గేట్లను దించడంతో ప్రాణహిత నీళ్లతో కాళేశ్వరం, మంథని ప్రాంతాల్లో గోదావరి నది జీవకళను సంతరించుకుంది. మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలకు, సోమవారం 6.50 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కన్నెపల్లి పంపుహౌస్‌ ద్వారా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నానానికి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోశారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదు మోటార్లను రన్‌ చేస్తూ 11 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా సోమవారానికి నీటి నిల్వ 4.47 టీఎంసీలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టులోకి 227 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలోకి 593 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోంది. ఎల్లంపల్లి మినహా గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ డెడ్‌ స్టోరేజీలోనే ఉన్నాయి. ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీలకు 5.36 టీఎంసీలు, మిడ్‌ మానేరులో 25.87 టీఎంసీలకు 3.38 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 24.07 టీఎంసీలకు 3.41 టీఎంసీలు, సింగూరులో 29.91 టీఎంసీలకు 0.36 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు 0.08 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 7.60 టీఎంసీలకు 2.94 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకు 4.89 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.