జగన్​  దూకుడు.. కేసీఆర్​ సైలెంట్​

జగన్​  దూకుడు.. కేసీఆర్​ సైలెంట్​

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సీఎం ఫిర్యాదులు
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు వరుసబెట్టి లెటర్లు 
తెలంగాణ ప్రాజెక్టులు చూశాకే సంగమేశ్వరం రావాలి
సంగమేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలి
ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని విజ్ఙప్తి
ఏపీ అక్రమ ప్రాజెక్టులపై పల్లెత్తు మాట అంటలే
తప్పులు బయటపడుతాయనే దాపరికం
కేటీఆర్​, హరీశ్​రావు కూడా నో కామెంట్​
అప్పట్లో కేసీఆర్ డైరెక్షన్​తోనే జగన్​ ఇప్పుడు ముందుకు

మన నీళ్లను మలుపుకపోవుడే కాకుండా మనమీదనే గయ్యుమని లేస్తున్నరు ఏపీ సీఎం జగన్. దక్షిణ తెలంగాణను ఎడారి చేసే అక్రమ ప్రాజెక్టులను కడుతూ.. అవన్నీ పాతయేనని కొత్త పాట పాడుతున్నరు. కేంద్రానికి లెటర్ల మీద లెటర్లు పోస్టు చేస్తున్నరు. ఇంత జరుగుతున్నా మన సీఎం కేసీఆర్​ మాత్రం నోరెత్తుతలేరు. కండ్ల ముందు జనం కనిపిస్తే చాలు కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుడు తప్పిస్తే ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడీపై  ఒక్క మాట మాట్లాడ్తలేరు. రాయలసీమను రతనాల సీమ చేస్తమని, గోదావరి-కృష్ణాను లింక్​ చేస్తామని గతంలో జగన్​ను ఇంటికి పిలిచి కేసీఆర్​ ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్పిండు. అవే ఇప్పుడు దక్షిణ తెలంగాణకు శాపంగా మారుతున్నయ్​. 
హైదరాబాద్‌, వెలుగు: ఓవైపు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఏపీ సీఎం జగన్‌.. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులపై కంప్లైంట్లు చేస్తున్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు.. ముందు తెలంగాణ ప్రాజెక్టులనే తనిఖీ చేయాలని,  ఆ తర్వాత సంగమేశ్వరానికి రావాలంటూ మెలిక పెడుతున్నారు.  సంగమేశ్వరం కొత్త ప్రాజెక్టే కాదని, పాత ప్రాజెక్టులకు నీళ్లిచ్చేందుకే చేపడుతున్నట్లు ఆయన వాదిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ అడిగిన అదనపు సమాచారం ఇచ్చామని, వెంటనే పర్యావరణ అనుమతులు ఇప్పించాలని కోరుతున్నారు. మరోవైపు సంగమేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా రైతులు నేషనల్​ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కొత్త రిజర్వాయర్లు నిర్మిస్తూ తమ భూములు ముంచేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
లెటర్ల మీద లెటర్లు..
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల లొల్లి ముదురుతోంది. దీనిపై నాలుగు రోజులకింద ప్రధాని మోడీకి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్‌ సోమవారం కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, ప్రకాశ్‌ జవదేకర్‌కు వేర్వేరు లెటర్లు రాశారు. 

హైదరాబాద్​, వెలుగు:  ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడీ మీద సీఎం కేసీఆర్​ పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. ఏడాదిన్నర కాలంగా కృష్ణా ప్రాజెక్టుల వైపు చూడని ఆయన ఇప్పటికీ దక్షిణ తెలంగాణను ముంచే ఏపీ ప్రాజెక్టులపై స్పందించటం లేదు. వీలు దొరికినప్పుడుల్లా కాళేశ్వరం గొప్పలు చెప్తున్న సీఎం.. కృష్ణా నీళ్ల దోపిడీపై మౌనం వహిస్తున్నారు. మంత్రులను ఎగేసుడు, ఆఫీసర్లతో ఫిర్యాదులు చేయించుడు తప్ప స్వయంగా స్పందించడం లేదు. ఇటీవల వాసాలమర్రిలో బహిరంగ వేదికపై మాట్లాడినప్పుడు కృష్ణా నీళ్ల మాటెత్తలేదు. రెండు రోజుల కింద  సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన కేసీఆర్​.. ఇతర గొప్పలన్నీ చెప్పుకొని..  ఏపీతో జల జగడంపై కిమ్మనకుండా దాటవేశారు. గోదావరి నీళ్లతో ఉమ్మడి కరీంనగర్​ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన కేసీఆర్​.. అసలు కృష్ణా నీళ్ల టాపికే ఎత్తకపోవటం గమనార్హం. అయితే..  కృష్ణా నీళ్లతో సంబంధం లేని గోదావరి ఏరియా మంత్రులు మాత్రం ఏపీ అక్రమ ప్రాజెక్టులపై తోచిందల్లా మాట్లాడారు.  ఇంతకాలం కేసీఆర్​ ఏపీకి వంత పాడిన విషయాన్ని దాచి పెట్టి తిట్ల పురాణంతో విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్​ రాజకీయం రాజేశారు. 

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 800 అడుగల లెవల్‌‌ నుంచి నీళ్లు తీసుకునేలా పాలమూరు –  రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని, 796 అడుగుల లెవల్‌‌ నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను కరెంట్‌‌ ఉత్పత్తి కోసం తోడుతోందని షెకావత్‌‌కు రాసిన లెటర్​లో  జగన్‌‌  ఆక్షేపించారు. కేఆర్‌‌ఎంబీ, సీడబ్ల్యూసీకి ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇచ్చి అనుమతి తీసుకోవాలని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశంలో నిర్ణయించామని తెలిపారు. ముందు తెలంగాణ  ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాతే కృష్ణా బోర్డు తాము చేపట్టిన సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ పనులు పరిశీలించేందుకు రావాలని జగన్​ మెలిక పెట్టారు. ఎన్జీటీ ఆదేశాలతో కేఆర్‌‌ఎంబీ ఆ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తోందనే వాస్తవాన్ని ఆయన తొక్కిపెట్టారు. శ్రీశైలంలో 834 అడుగుల దిగువకు నీళ్లున్నా తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తోందని, జూన్‌‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీలు వాడిందని, ఇలా వ్యవహరిస్తే శ్రీశైలం నిండటం అసాధ్యమన్నారు. ఫలితంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందకుండా పోతాయని జగన్​  పేర్కొన్నారు. కరెంట్‌‌ ఉత్పత్తి విషయంలో  కేఆర్‌‌ఎంబీ ఆదేశాలను తెలంగాణ  పట్టించుకోవడం లేదని  అన్నారు. వెంటనే బోర్డు జ్యూరిస్‌‌డిక్షన్‌‌ నిర్ధారించి ప్రాజెక్టులన్నీ కేఆర్‌‌ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సీఐఎస్‌‌ఎఫ్‌‌ బలగాలతో భద్రత కల్పించాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఇంతలా దాడికి దిగుతున్న జగన్‌‌.. శ్రీశైలం నుంచి పెన్నా బేసిన్‌‌కు నీళ్లు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు.
మమ్మల్ని ముంచేస్తున్నరు: ఎన్జీటీని ఆశ్రయించిన చిత్తూరు రైతులు
రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో రోజుకు 3 నుంచి 8 టీఎంసీలు తరలించే అక్రమ ప్రాజెక్టులు చేపట్టి ఏపీ సర్కారు తమను ముంచేస్తుందని చిత్తూరు జిల్లా రైతులు నేషనల్​ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ను ఆశ్రయించారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నాగిల్లవారిపల్లికి చెందిన గుత్తా గుణశేఖర్‌‌,  ఆవులపల్లె, బయరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మరో 12 మంది రైతులు ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌లో సోమవారం పిటిషన్‌‌ దాఖలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, రాయలసీమ లిఫ్ట్‌‌ ద్వారా గాలేరు -– నగరి సుజల స్రవంతికి తరలించే నీటిని నిల్వ చేసేందుకు కొత్త రిజర్వాయర్లు  నిర్మిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా తమను రెవెన్యూ అధికారులు  వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అన్న ఎన్జీటీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తోందని  తెలిపారు. చిత్తూరు జిల్లా కుమబాలకోట మండలం ముడివీడు, పుంగనూరు మండలం నేతిగుంటపల్లి, సోమల మండలం ఆవులపల్లిలో రూ. 2,144.50 కోట్లతో కొత్తగా మూడు బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్లు నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఆవులపల్లి రిజర్వాయర్‌‌ కింద 500 ఏండ్ల పురాతన సీతమ్మ ఆలయం ముంపునకు గురవుతోందన్నారు. వందలాది మంది రైతులను నిర్వాసితులను చేస్తున్నారని, అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 
కేసీఆర్​ సైలెంట్

రాష్ట్రంలో ఇరిగేషన్​ శాఖకు ప్రత్యేకంగా మంత్రులెవరూ లేరు. రెండో సారి అధికారంలోకి వచ్చాక నీళ్ల పోర్ట్ పోలియో ను కేసీఆర్​ తన దగ్గరే ఉంచుకున్నారు. కానీ ఇంత జరిగినా కేసీఆర్ మాట్లాడటం లేదు.  ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు, ఇంజనీర్లతో కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయించడం తప్ప.. సీఎం నేరుగా స్పందించకపోవటం సందేహాస్పదంగా మారింది. కేసీఆర్​ సూచనలతోనే ఏపీ సీఎం జగన్ అక్కడి ప్రాజెక్టుల స్పీడ్​ పెంచినట్లు విమర్శలున్నాయి. ఇద్దరు సీఎంల  భేటీ సందర్భంగానే గోదావరి –  కృష్ణా లింక్​, కృష్ణా నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే డిస్కషన్​ జరిగింది. కృష్ణా నీళ్లను వాడుకొమ్మని ఏపీకి చెప్పింది తానేనని కేసీఆర్​ అసెంబ్లీలోనే గొప్పగా చెప్పుకున్నారు. అందుకే కేసీఆర్​ సహకారంతోనే ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంటోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. తన తప్పులు  బయటపడుతాయనే  కేసీఆర్ ఏపీ జల దోపిడీపై నేరుగా మాట్లాడకుండా తప్పించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.

పర్యావరణ అనుమతులు ఇప్పించండి
సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇప్పించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌‌ జవదేకర్‌‌కు రాసిన లెటర్​లో జగన్‌‌  కోరారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు –- నగరి, కేసీ కెనాల్‌‌, చెన్నై తాగునీటికి 111 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లోని 11వ షెడ్యూల్‌‌లో గల పదో పేరాలో పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని తీసుకోవడానికే తాము రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని చెప్పారు.  ప్రాజెక్టు డీపీఆర్‌‌ను సీడబ్ల్యూసీ రూల్స్​ మేరకు రూపొందించి సమర్పించామన్నారు. తాము చేపడుతున్న ప్రాజెక్టు రోళ్లపాడు వైల్డ్‌‌ లైఫ్‌‌ సాంక్చురీకి 10 కి.మీ.ల దూరంలో ఉందని, అటవీ భూమిలో ఎలాంటి పనులు చేపట్టడం లేదని జవదేకర్​కు రాసిన లేఖలో జగన్​ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ పట్టించుకోకుండా కరెంట్‌ ఉత్పత్తి చేస్తోంది. దీంతో మా ప్రాజెక్టులకు నీళ్లందకుండా పోయే ప్రమాదముంది. అందుకే కొత్త లిఫ్ట్‌ ప్రాజెక్టు చేపట్టాం. ఎన్జీటీ చెన్నై బెంచ్‌ మేం చేపట్టిన ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై  ఎన్విరాన్‌మెంట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈఏసీ)కి దరఖాస్తు చేసుకున్నాం. జూన్‌ 17న మా అభ్యర్థనను కమిటీ పరిశీలించింది. కమిటీ అడిగిన అదనపు సమాచారాన్ని జూన్‌ 30న అప్‌లోడ్‌ చేశాం.
                                                                                                                                                                  - కేంద్రమంత్రి జవదేకర్​కు రాసిన లేఖలో జగన్​ 
ఏడు నెల్లకు ఎన్జీటీలో ధిక్కార పిటిషన్‌
ఎట్టకేలకు  సంగమేశ్వరంపై ఫైల్ చేసిన రాష్ట్ర అధికారులు
 ప్రైవేట్‌‌ పిటిషన్‌‌పై ఇప్పటికే  ఆదేశాలిచ్చిన గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌
 పర్యావరణ అనుమతులివొద్దని అప్రైజల్‌‌ కమిటీకి తెలంగాణ లేఖ
 మా ఈఎన్సీ బిజీ.. త్రీమెన్‌‌ కమిటీ రద్దు చేయండి: కేఆర్‌‌ఎంబీకి మరో లెటర్‌‌
కేటీఆర్​, హరీశ్ కూడా మాట్లాడ్తలే

కేసీఆర్​ తర్వాత.. పార్టీ, ప్రభుత్వ స్కీమ్​లపై ఎక్కువసార్లు మాట్లాడే మంత్రి కేటీఆర్​ కూడా ఏపీ చేస్తున్న జల దోపిడీపై స్పందించడం లేదు.  మిగతా మంత్రులు రోజుకోచోట ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మాట్లాడుతుంటే.. కేటీఆర్​ మాత్రం తనకు సంబంధం లేనట్లుగా దూరంగా ఉంటున్నారు. టీఆర్​ఎస్​ తొలి హయాంలో ఇరిగేషన్​ మినిస్టర్​గా ఉన్న హరీశ్​రావు కూడా కృష్ణా ప్రాజెక్టులపై మాట్లాడటం లేదు. పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్​పై తెలంగాణ ఉద్యమ సమయంలో  ముందుండి పోరాటం చేసిన హరీశ్​ రావు, రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై బాగా అవగాహన ఉన్నప్పటికీ..  ఇప్పుడు సైలెంట్​గా ఉంటున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ వ్యవహారాలన్నీ దగ్గరుండీ నడిపే కేసీఆర్​, కేటీఆర్, హరీశ్.. ముగ్గురు ముఖ్యులు కృష్ణా నీళ్ల లొల్లిపై మాట్లాడకపోవడం సొంత  పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా 
విస్మయానికి గురి చేస్తోంది.