ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ

ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ

అమరావతి: కరోనాకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై  హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని, ఆనందయ్య ఉపయోగిస్తున్న మందుపై పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ల్యాబ్ ల నుంచి ఈనెల 29న రిపోర్టులు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. చాలా ప్రజలు ఆనందయ్య మందు కావాలని కోరుతున్నారని, భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వీలైనంత త్వరగా రిపోర్టులు తెప్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఆదేశాలిచ్చిందని ప్రస్తావించిన పిటిషనర్ తరపు న్యాయవాది, లోకాయుక్త ఏకపక్షంగా ఎలా  ఆదేశాలు ఇస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆనందయ్య తో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది బాలాజీ  తెలిపారు. ఆనందయ్య తన మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వని కుమార్  తెలిపారు. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో కోర్టుకు కేంద్రం తెలియ జేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం తెలిపింది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవు కదా అని కోర్టు ప్రశ్నించగా లిఖిత పూర్వకంగా ఇది ఇంకా స్పష్టం కాలేదని ప్రభుత్వ ప్రతినిధి తెలియజేశారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.