వాళ్ళు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి: కృతి సనన్

వాళ్ళు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి: కృతి సనన్

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆదిపురుష్. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్  రాముడి పాత్రలో, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటించనున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ తెరకేక్కిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

తాజాగా ఐఫా 2023  అవార్డ్స్‌లో పాల్గొన్న హీరోయిన్ కృతి ఆదిపురుష్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.  ‘‘ఆదిపురుష్‌ సినిమా చాలా ప్రత్యేకమైంది. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని తరాల వాళ్లు.. మరీ ముఖ్యంగా పిల్లలు ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాలి. మన చిన్నతనంలో రామాయణం, మహా భారతాల్లోని కథలు మన అమ్మ, అమ్మమ్మలు చెబుతుంటే విన్నాం. వాటిని సినిమాగా చూపిస్తే పిల్లలపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ విజువల్‌ వండర్‌ త్రీడీలో ఇంకా బాగా ఆకట్టుకుంటుంది. కాబట్టి వాళ్లంతా కొత్త అనుభూతికి లోనవుతారు. పిల్లలతో పాటు నేటి తరం యువతకు కూడా ఈ సినిమాకు చాలా కనెక్ట్‌ అవుతారు. 

ఆదిపురుష్‌ ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘జై శ్రీరామ్‌’ పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలోని రెండో పాట కూడా త్వరలో విడుదల కానుంది. ఆపాట కూడా అందరిని అలరిస్తుంది. అది నాకెంతో ఇష్టమైన పాట. ప్రేక్షకుల హృదయాలకు  హత్తుకునేలా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి సనన్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.