ఏపీ, తెలంగాణకు 66:34 నిష్పత్తిలో కేటాయించిన కేఆర్ఎంబీ

ఏపీ, తెలంగాణకు 66:34 నిష్పత్తిలో కేటాయించిన కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి జలాశయాల్లో తెలంగాణకు35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీల నీటిని కేటాయించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రీమెన్ కమిటీ ఓకే చెప్పింది. శుక్రవారం జలసౌధలో బోర్డు సభ్యకార్యదర్శి, కమిటీ కన్వీనర్ డీఎం రాయిపురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. మీటింగ్ కు తెలంగాణ ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి తెలంగాణ 50 టీఎంసీల నీటిని కోరగా.. శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 15 టీఎంసీలు కేటాయించాలని ఏపీ పట్టుబట్టింది.

తాగునీటి అవసరాలకు ఎంత నీటినైనా తీసుకోవచ్చని.. సాగునీటికి మాత్రం 66:34  నిష్పత్తిలో (ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం) పంపిణీ చేయాలని కోరింది. అయితే, ముందుగా 50 టీఎంసీలు అడిగిన తెలంగాణ.. చివరకు 35 టీఎంసీలకే అంగీకరించింది. నాగార్జునసాగర్ నుంచి 30.7 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 4.3 టీఎంసీలు తీసుకునేందుకు ఓకే చెప్పింది. ఏపీ మాత్రంగ 45 టీఎంసీలు ఇవ్వాలని పట్టుబట్టి ఆ మేరకు కేటాయింపులు సాధించుకుంది. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో 82.788 టీఎంసీలు ఉండగా, ఇందులో మే 2024 వరకు 80 టీఎంసీలు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగతా 2.788 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించారు.