పైసలిస్తరా.. టెలిమెట్రీల డబ్బు వాడుకోవాల్నా?..తెలంగాణ, ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

పైసలిస్తరా.. టెలిమెట్రీల డబ్బు వాడుకోవాల్నా?..తెలంగాణ, ఏపీకి కృష్ణా బోర్డు లేఖ
  • బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు పైసా ఇయ్యలేదని వెల్లడి
  • టెలిమెట్రీల కోసం రూ.4.18 కోట్లిచ్చిన తెలంగాణ
  • రూపాయి కూడా ఇయ్యని ఏపీ

హైదరాబాద్, వెలుగు: బోర్డు నిర్వహణకు చిల్లిగవ్వ కూడా లేదని, వెంటనే బడ్జెట్​ను విడుదల చేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది. నిధులు విడుదల చేయకపోతే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన నిధులను వాడుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాజాగా రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది.

 అయితే, ఆ టెలిమెట్రీల సొమ్ము కూడా తెలంగాణ ఇచ్చిన నిధులే కావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఏపీ విభజన చట్టం ప్రకారం బోర్డు నిర్వహణ ఖర్చు రెండు రాష్ట్రాలు సగం సగం భరించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.24 కోట్లు కావాలని గత జనవరిలో నిర్వహించిన 19వ బోర్డు మీటింగులో అంచనా వేసి ఆ మేరకు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్​కు రెండు రాష్ట్రాలూ ఆమోదం తెలిపాయి. 

అయితే, రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ నిధులు ఇవ్వలేదు. నిరుడు కూడా కొన్ని నిధులను పెండింగ్​ పెట్టాయి. దీంతో బోర్డుకున్న కార్పస్​ ఫండ్​ నుంచి జీతాల చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆ నిధులు కూడా ఖాళీ అయ్యాయని, వచ్చే నెల జీతాలిచ్చేందుకూ పైసల్లేవని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిధులను వెంటనే విడుదల చేయాలని, లేదంటే టెలిమెట్రీల డబ్బులు వాడుకుంటామని బోర్డు అధికారులు రాష్ట్ర సర్కారుకు తేల్చి చెప్పారు.  

టెలీమెట్రీల కోసం రూ.4.18కోట్లు

కృష్ణా నీటి వినియోగంపై లెక్కలను పక్కాగా చేపట్టేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. మొదటి విడతలో నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. ఫేజ్‌‌‌‌‌‌‌‌ 2 కింద శ్రీశైలం రైట్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌  కెనాల్‌‌‌‌‌‌‌‌ (పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటరీ దిగువన 3 కి.మీ వద్ద), కేసీ కెనాల్‌‌‌‌‌‌‌‌, నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌  ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువ, ప్రకాశం బ్యారేజీ తూర్పు  మెయిన్‌‌‌‌‌‌‌‌  కెనాల్‌‌‌‌‌‌‌‌, పశ్చిమ ప్రధాన కాలువ, పోలవరం కుడి కాలువ సంగమం, పాలేర్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌, సాగర్‌‌‌‌‌‌‌‌  ఎడమ కాలువపై ఏపీ, తెలంగాణ సరిహద్దులోని 21వ ప్రధాన బ్రాంచ్‌‌‌‌‌‌‌‌  కెనాల్‌‌‌‌‌‌‌‌  మొత్తంగా 9 ముఖ్యమైన ప్రదేశాల్లో సైడ్‌‌‌‌‌‌‌‌ లుకింగ్‌‌‌‌‌‌‌‌  డాప్లర్‌‌‌‌‌‌‌‌  కరెంట్‌‌‌‌‌‌‌‌  ప్రొఫైలర్లతో (ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌డీసీపీ) టెలిమెట్రీ స్టేషన్లను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌  చేయాల్సి ఉంది. 

అందుకు రూ.7.18 కోట్లు అవసరమవుతాయని బోర్డు ఇటీవల అంచనా వేసింది. ఆ నిధులను ఇరు రాష్ట్రాలు సమంగా భరించాల్సి ఉంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రూ.4.18 కోట్లను టెలిమెట్రీల ఏర్పాటు కోసం బోర్డుకు విడుదల చేసింది. ఏపీ సర్కారు మాత్రం విడుదల చేయలేదు.