
- తెలంగాణ అభ్యంతరాలకు స్పందన
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స్పందించింది. ఆ ప్రాజెక్ట్‌పై వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
దీనిపై ఈ నెల 10నే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.
డీపీఆర్‌కు టెండర్లు పిలవకుండా ఏపీని ఆపాలంటూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాసిన ఆ లేఖను తాజాగా ఏపీకి పంపుతూ.. కృష్ణా బోర్డు చైర్మన్ లేఖ రాశారు. ‘‘బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధమవుతున్నట్టు తెలంగాణ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది.
డీపీఆర్ తయారీకి టెండర్లు పిలుస్తున్నట్టు కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను వెంటనే తెలియజేయండి. ప్రాజెక్ట్ స్థితిగతులపై వారంలోగా వివరణ ఇవ్వండి’’ అని పేర్కొంటూ ఏపీ ఈఎన్సీకి బోర్డు చైర్మన్ లేఖ రాశారు.