కేఆర్ఎంబీ టీమ్ ‘సంగమేశ్వరం’ పరిశీలన

కేఆర్ఎంబీ టీమ్ ‘సంగమేశ్వరం’ పరిశీలన

ఎన్జీటీ ఆదేశాలు ఎట్టకేలకు అమలు.. కేంద్రం, ఎన్జీటీకి రిపోర్ట్ ఇస్తామన్న సభ్యులు
హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కార్​ అక్రమంగా నిర్మిస్తున్న సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీమ్ పనులను కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డు(కేఆర్​ఎంబీ) ఎక్స్​పర్ట్ టీమ్ బుధవారం పరిశీలించింది. బోర్డు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే సారథ్యంలోని ఈ బృందంలో బోర్డు మెంబర్ (పవర్) ఎల్బీ మౌన్ తంగ్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ దర్పణ్ తల్వార్ సభ్యులుగా ఉన్నారు. మొదట ఎక్స్ పర్ట్ టీమ్ కర్నూల్​ జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని విజిట్ చేసింది. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చేరుకొని నిర్మాణంలో ఉన్న సంగమేశ్వరం పనులు పరిశీలించింది. ఎక్స్ పర్ట్ టీంకు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, కర్నూల్ ప్రాజెక్టుల సీఈ మురళీనాథ్ రెడ్డి స్వాగతం పలికారు. ఏపీ ఈఎన్సీ ఈ లిఫ్ట్​ స్కీమ్​పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
కాంక్రీట్ పనులు చేయలేదు: ఏపీ 
తెలుగు గంగా, గాలేరు ‌‌– నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు కేటాయించిన నీటినే కొత్త ఎత్తిపోతలతో తీసుకుంటామని చెప్పారు. అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టు లేదని, కొత్తగా ఎలాంటి స్టోరేజీ కూడా లేదని వివరించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అడిగిన పూర్తి సమాచారం ఇచ్చామన్నారు. ప్రాజెక్టు డీపీఆర్ సైతం సీడబ్ల్యూసీ ఫార్మాట్​లో అందజేశామని చెప్పారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోగలమన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీట్ వర్క్ చేయలేదని వివరించారు. ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణా బోర్డు టీం తమ నివేదికను ఎన్జీటీకి, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పనులు పరిశీలించి తమకు నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఈ ఏడాది జనవరిలో కృష్ణా బోర్డును ఆదేశించింది. అప్పటి నుంచి పలుమార్లు బోర్డు సభ్యులు ప్రాజెక్టును విజిట్​ చేస్తామని లెటర్ రాసినా ఏపీ పట్టించుకోలేదు. ముందు తెలంగాణ ప్రాజెక్టులను చూశాకే తమ దగ్గరికి రావాలని మెలిక పెట్టింది. ప్రాజెక్టు పరిశీలన బృందంలో తెలంగాణ స్థానికత గల చీఫ్ ఇంజనీర్ ఉన్నారని అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును తనిఖీ చేయడానికి 3 వారాల గడువు కావాలని కృష్ణా బోర్డు కోరగా, ఆ అభ్యర్థనను గ్రీన్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. శుక్రవారంలోగా నివేదిక ఇచ్చి తీరాలని ఆదేశించడంతో బుధవారం ఆగమేఘాల మీద ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లింది. బోర్డు టీం నివేదిక ఏమిస్తుందా అని  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.