ఏప్రిల్ 4న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

ఏప్రిల్ 4న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ
  • నీటి కొరత నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం
  • మార్చి నెలాఖరు దాకా వాడుకున్న నీటిపై లెక్క ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) త్రీ మెంబర్​ కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గురువారం ఉదయం జలసౌధలో తెలంగాణ, ఏపీ అధికారులతో సమావేశం అవ్వాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రాష్ట్రాల అవసరాలు, వాటర్​ అకౌంట్​ తదితర విషయాలపై సమావేశంలో చర్చించనున్నారు. 

ఈ సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కావాలని బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి నెలాఖరు దాకా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటిపై వాటర్​ అకౌంట్​ వివరాలు ఇవ్వాలని కేఆర్ఎంబీ మెంబర్​ను ఆదేశించింది. ఈ మేరకు మీటింగ్​ నోటీసులను తెలంగాణ, ఏపీ ఈఎన్​సీలు, కేఆర్ఎంబీ చైర్మన్​ పీఎస్​, మెంబర్లకు పంపించింది. కాగా, రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో పలుచోట్ల తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాలు ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.