తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ.. 27న మీటింగ్‌‌‌‌

తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ.. 27న మీటింగ్‌‌‌‌
  • తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ
  • సమావేశంలో చర్చించే అంశాల ప్రస్తావన
  • బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ) 14వ సమావేశం ఈ నెల 27న నిర్వహించనుంది. ఈ ఫుల్‌‌‌‌ బోర్డు మీటింగ్‌‌‌‌కు సభ్యులంతా హాజరుకావాలని బోర్డు మెంబర్‌‌‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌‌‌పురే తెలంగాణ, ఏపీకి లేఖ రాశారు. ఈనెల 9న నిర్వహించిన మీటింగ్‌‌‌‌కు తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు హాజరుకాలేదు. కేఆర్‌‌‌‌ఎంబీ సమావేశంలో చర్చించే ఎజెండాను లేఖతోపాటు పంపారు. బోర్డు 12వ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాల అమలు, కేఆర్‌‌‌‌ఎంబీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, కృష్ణా బోర్డుకు బడ్జెట్‌‌‌‌ విడుదలపై చర్చిస్తారు. 2020 --–-21 ఫైనాన్షియల్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో తెలంగాణ రూ.3.50 కోట్లు విడుదల చేసిందని, రెండేళ్లుగా ఏపీ నుంచి ఎలాంటి నిధులు రాలేదని తెలిపారు. ప్రస్తుతం బోర్డు ఖాతాలో రూ.2.46 కోట్లు మాత్రమే ఉన్నాయని, వీటితో బోర్డు నిర్వహణ కష్టమని తెలిపారు. రెండు రాష్ట్రాలు వెంటనే రూ.10 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. 

చర్చకురానున్న అనేక​అంశాలు
కృష్ణా బేసిన్‌‌‌‌లో లభ్యమయ్యే నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, తెలంగాణ కోరినట్టుగా చెరిసగం వాటాపై చర్చించడం, ఒక వాటర్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ ఓవర్‌‌‌‌ చేయడం, ప్రాజెక్టులన్నీ నిండి సర్‌‌‌‌ప్లస్‌‌‌‌ అయ్యే రోజుల్లో నీటి వినియోగం అంశాలపై మీటింగ్​లో చర్చించనున్నారు. అలాగే కృష్ణా బోర్డు జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ అమలు, కొత్త ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు, కరెంట్‌‌‌‌ ఉత్పత్తి వివాదాలు, మైనర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ కింద నీటి వాడకం, కృష్ణా బేసిన్‌‌‌‌కు గోదావరి జలాల మళ్లింపు, కేఆర్‌‌‌‌ఎంబీ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌ విశాఖపట్నానికి తరలింపుపై మీటింగ్​లో చర్చించనున్నారు.  

శాంక్షన్‌‌‌‌ పోస్టుల వివరాలివ్వండి
పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌కు సంబంధిం చి రెండు రాష్ట్రాల పరిధిలోని హైడ్రో పవర్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లకు శాంక్షన్‌‌‌‌ అయిన పోస్టుల వివరాలు ఇవ్వాలని కృష్ణా బోర్డు కోరింది. తెలంగాణ, ఏపీ ఎనర్జీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సెక్రటరీలకు కేఆర్‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌‌‌పురే సోమవారం లేఖ రాశారు. కేంద్రం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ గెజిట్‌‌‌‌ జారీ చేసినందున రెండో షెడ్యూల్‌‌‌‌లో చేర్చిన ప్రాజెక్టుల సిబ్బంది, ఇతర వివరాలు తెలపాలని కోరారు. పవర్‌‌‌‌ ప్రాజెక్టుకు శాంక్షన్‌‌‌‌ అయిన పోస్టులు ఎన్ని, ఏ పోస్టులు, వర్క్‌‌‌‌ చార్జ్‌‌‌‌డ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఇవ్వాలన్నారు. ఆ కేంద్రాల్లో వేరే ఏజెన్సీలు ఏమైనా పనిచేస్తున్నాయా.. చేస్తే వాటి వివరాలు తెలియజేయాలని కోరారు.