అనుమతి లేకుండా కట్టిన ప్రాజెక్టుల వివరాలివ్వండి..ఏపీకి కేఆర్​ఎంబీ లేఖ

అనుమతి లేకుండా కట్టిన ప్రాజెక్టుల వివరాలివ్వండి..ఏపీకి కేఆర్​ఎంబీ లేఖ
  • అక్రమంగా 86 ప్రాజెక్టులను ఏపీ కడుతోందని తెలంగాణ ఇంజనీర్స్​ ఫోరం ఫిర్యాదు
  • ప్రాజెక్టుల పేర్లతో సహా ఫిర్యాదు చేసిన ఫోరం కన్వీనర్​ దొంతుల లక్ష్మీనారాయణ
  • ఫిర్యాదుపై ఈ నెల మొదటి వారంలోనే కేఆర్​ఎంబీకి కేంద్ర జలశక్తి ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: అనుమతి లేకుండా కడుతున్న ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాల్సిందిగా ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలతో కేఆర్​ఎంబీ మెంబర్​ సెక్రటరీ డీఎం రాయ్​పురే మంగళవారం ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డికి లెటర్​ రాశారు. ఏపీ కట్టిన, కడుతున్న ప్రాజెక్టులపై జనవరి 29న కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ఇంజనీర్స్​ ఫోరం కన్వీనర్​ దొంతుల లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కృష్ణా, గోదావరి నదులతో పాటు వాటి ఉపనదులపై ఏపీ ప్రభుత్వం 86 ప్రాజెక్టులను కడుతోందని అందులో పేర్కొన్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ సెకట్రరీ ఏసీ మాలిక్​.. చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ నెల మొదటి వారంలో కృష్ణా బోర్డును ఆదేశించారు. తెలంగాణ ఇంజనీర్స్​ ఫోరం ఫిర్యాదులో పేర్కొన్న ప్రాజెక్టుల సమాచారం, వాటిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు.
లక్ష కోట్లతో ఏపీ ప్రాజెక్టులు
2014 జూన్​ 2 తర్వాత విభజన చట్టాన్ని అతిక్రమించి 47 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ సర్కార్​ చర్యలు చేపట్టిందని జనవరి నాలుగో వారంలో కృష్ణా బోర్డుకు  తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆ ప్రాజెక్టులను రూ.లక్ష కోట్లతో చేపడుతోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది. వాటితో పాటు మరో 39 ప్రాజెక్టులు కలిపి మొత్తంగా 86 ప్రాజెక్టులను ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ నిర్మిస్తోందని కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టినా వాటికి సంబంధిత రివర్​ బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్​ అప్రైజల్​, అపెక్స్​ కౌన్సిల్​ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. అయినా వాటిని పట్టించుకోకుండానే ఏపీ పనులు చేపట్టిందని పేర్కొంది. కొన్ని ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించినా, విభజన తర్వాత వాటి స్వరూపాన్ని మార్చారని తెలిపింది.
ప్రకాశం బ్యారేజీతో మొదలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ఏర్పడిన తర్వాత ప్రకాశం బ్యారేజీ విస్తరణతోనే ఏపీ భూభాగంలో అక్రమ ప్రాజెక్టులకు పునాది వేశారని రిటైర్డ్​ ఇంజనీర్​ లక్ష్మీ నారాయణ తెలిపారు. బ్రిటిష్​ ఇండియాలో నిర్మించిన ప్రకాశం బ్యారేజీని తర్వాత విస్తరించారని, దానికి ఇప్పటికీ ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. ఏపీ సర్కారు కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులపై అక్రమ ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. కొరిసపాడు లిఫ్ట్​, మడకశిర బ్రాంచ్​ కెనాల్​, అడవిలపల్లి, గాలేరు  నగరి, హంద్రీనీవా, జీడిపల్లి లిఫ్ట్​, సోమశిల–స్వర్ణముఖి లింక్​ కెనాల్​, రామతీర్థం బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​, వైకుంఠపురం బ్యారేజీ, గండికోట–చిత్రావతి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ లిఫ్ట్​, మర్ల రిజర్వాయర్​, అనుపు లిఫ్ట్​, ఏమిలేరు పంపింగ్​ స్కీం, ఎన్​జీ పాడు లిఫ్ట్​, అర్నేర్​ ప్రాజెక్టు, గొల్లపూడి, గుడిమెట్ల 2, జూపాడు బంగ్లా2, కోపర్రు, కొప్పునూరు లిఫ్టులు, కుప్పం బ్రాంచ్​ కెనాల్​, పులకుర్తి, పులి కనుమ, సంగమేశ్వరం లిఫ్ట్​, త్యల్లూరు, వెలిగొండ, భైరవానితిప్ప, తారకరామ, కండలేరు, కృష్ణాపురం, యోగి వేమన, పెన్నా అహోబిలం, గురురాఘవేంద్ర, రెమట, గుంటూరు కెనాల్​, గుండ్రేవుల, ఆర్డీఎస్​– ఆర్​ఎంసీ, తుంగభద్ర హైలెవెల్​ కెనాల్​, గండిపాలెం, స్వర్ణముఖి, నెల్లూరు బ్యారేజీ, పెన్నా డెల్టా, సిద్ధాపురం, సోమశిల, మిడ్​ పెన్నార్​ రిజర్వాయర్​, అప్పర్​ సగిలేరు, తమ్మిలేరు, హీరమండలం, వంశధార రెండు స్టేజీలు, వేదవతి, అనంతపురంలోని కమ్యూనిటీ లిఫ్ట్​ స్కీంలు చేపట్టిందని తెలిపారు.

గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులివి 
గోదావరి బేసిన్​లో చెంగల్నాడు, చింతలపూడి లిఫ్టులు, గోదావరి–పెన్నా లింక్​ ఫేజ్​-1, పురుషోత్తమపట్నం, వెంకటనాగారం లిఫ్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అరికిరేవుల, పట్టిసీమ, పోగొండ రిజర్వాయర్​, వేగేశ్వరపురం, కొవ్వాడ కాల్వ రిజర్వాయర్​, విజయరాయి ఆనికట్​, తాండవ, మాదిగెడ్డ ప్రాజెక్టులు నిర్మిస్తోందని దొంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. నాగావళి, వంశధార బేసిన్లలో తోటపల్లి మోడర్నైజేషన్​, తారకరామతీర్థ సాగరం రిజర్వాయర్​, ఒట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెద్దంకలం, వంశధార–నాగావళి లింక్​ ప్రాజెక్టులను కట్టిందని పేర్కొన్నారు.