బెంగళూరు: ఐపీఎల్ 2026 ఫైనల్, ప్లేఆఫ్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి ఇతర నగరాలకు తరలించడం పట్ల కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. నిబంధనల పేరుతో ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొంది. గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ఈ ఏడాది స్టేడియంలో భారీగా భద్రతా ఏర్పాట్లు, ఆధునీకరణ పనులు చేపట్టారు.
ఈ సీజన్‌లో జరిగిన ఐదు లీగ్ మ్యాచ్‌లు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతంగా నిర్వహించామని, ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని కేఎస్‌సీఏ గుర్తుచేసింది. తమకు ఫైనల్, ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఇవ్వకపోవడానికి గల ఖచ్చితమైన కారణాలను బీసీసీఐ ఇప్పటివరకు తెలపలేదని కేఎస్‌సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ పేర్కొన్నారు.
అయినప్పటికీ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ఈ ఏడాది చివరలో అంతర్జాతీయ మ్యాచ్‌లు బెంగళూరులో జరగనున్నాయి. అక్టోబర్ 17న భారత్-వెస్టిండీస్ టీ20, డిసెంబర్ 16న భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు కేఎస్‌సీఏ వెల్లడించింది.
