కాళేశ్వరం చూసి కేసీఆర్‌కు నోబెల్‌ ఇవ్వాలన్నరు: కేటీఆర్

కాళేశ్వరం చూసి కేసీఆర్‌కు నోబెల్‌ ఇవ్వాలన్నరు: కేటీఆర్

కేంద్ర ఐఏఎస్‌ బృందమే చెప్పింది

అంతకంటే ఇంకేం కావాలి

మిడ్‌మానేరు నిర్వాసితులకు ఎక్కువే ఇచ్చాం

అమాయకులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్​నేతలు: కేటీఆర్​

కాళేశ్వరం ప్రాజెక్టు చూసి సీఎం కేసీఆర్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని కేంద్రం నుంచి వచ్చిన ఐఏఎస్‌ల బృందం పేర్కొందని… అంతకంటే ఏం కావాలని సిరిసిల్ల ఎమ్మేల్యే, టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన టీఆర్​ఎస్​ బూత్​ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలోని మిడ్​మానేరు నిర్వాసితులకు అనుకున్నదానికంటే ఎక్కువగానే పరిహారం ఇచ్చామని, కాంగ్రెస్​నేతలు అమాయకులను రెచ్చగొట్టి పాదయాత్రల పేరిట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరిహారం తీసుకున్నవారిని కూడా తీసుకువచ్చి రోడ్ల మీద కూర్చుండబెట్టారని దుయ్యబట్టారు.  రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్​ నాయకులు పాదయాత్ర చేపట్టారని విమర్శించారు.  మిడ్​మానేరు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా, నిర్వాసితులకు సకాలంలో పరిహారం ఇవ్వని ఘనత కాంగ్రెస్​దని ఎద్దేవా చేశారు. అటువంటి మిడ్​మానేరును టీఆర్​ఎస్​ సర్కార్​ పూర్తి చేసి, సిరిసిల్లను సస్యశ్యామలం చేస్తోందని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నిర్వాసితులకు పరిహారం అందించడమే కాకుండా సీఎం కేసీఆర్ చొరవతో రూ. 350 కోట్లు అదనంగా చెల్లించామని ఆయన చెప్పారు. వేములవాడ అభివృద్ధి మీద బాధపడుతున్న కాంగ్రెస్​ నాయకులు వారి ప్రభుత్వ హయాంలో రాజన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని, పైగాదేవుడి సొమ్ము తిన్న ఘనత వారిదేనని విమర్శించారు.

అతి విశ్వాసంతోనే వినోద్​ను ఓడగొట్టుకున్నాం

రానున్న మున్సిపల్​ ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని టీఆర్​ఎస్​ కేడర్​కు కేటీఆర్​ సూచించారు. అతి విశ్వాసానికి పోయి.. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో వినోద్​కుమార్​ అనే మంచి నాయకుడి ఓటమికి కారణమయ్యామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రూపు రాజకీయాలు వీడాలని సూచించారు. నెల రోజుల్లో మిడ్​మానేరులోకి నీరు రాబోతుందని, సిరిసిల్ల బ్రిడ్జి కిందిదాకా బ్యాక్​ వాటర్​ వచ్చి ఇక్కడి ప్రాంతం పచ్చబడే రోజు అతిత్వరలో రాబోతుందని ఆయన అన్నారు.