- రిజర్వేషన్లు అమలు చేయకుండానే రాహుల్ దేశమంతా చెప్పుకుంటున్నారు
- రాహుల్ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందుంచుతామని వెల్లడి
- కేసీఆర్ చేసిన మేలును బీసీలు మర్చిపోరు: హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్ల పేరుతో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ఎండగడతామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్తుంగలో తొక్కిందని, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
సోమవారం తెలంగాణ భవన్ లో బీసీ ప్రజా ప్రతినిధులు, నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ కు చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై చర్చపెట్టాలన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీల తరఫున గళం విప్పాలన్నారు. ఈ విషయంలో బీజేపీ చేస్తున్న మోసాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ వెంటే బీసీలు: హరీశ్ రావు
రాష్ట్రంలోని బీసీలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు కేసీఆర్ చేసినన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ వ్యక్తి కూడా చేయలేదన్నారు. కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును బీసీలు గుర్తుంచుకున్నారన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే రూపొందిస్తామన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు బండ ప్రకాష్ ముదిరాజ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మధుసూదనా చారి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పదేండ్లు కష్టపడి పనిచేశారు..
జీహెచ్ ఎంసీలో బీఆర్ ఎస్ కార్పొరేటర్లు అవినీతి లేకుండా పనిచేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. సోమవారం తెలంగాణ భవన్ లో జీహెచ్ ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. కరోనా వంటి తీవ్ర సంక్షోభ సమయంలో అద్భుతంగా సేవలందించారన్నారు. ఈ నెల 29న జరగనున్న దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని కోరారు.
