కేసీఆర్ పై కక్షతోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తలేరు: కేటీఆర్​

కేసీఆర్ పై కక్షతోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తలేరు: కేటీఆర్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: కేసీఆర్ పై కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ చేస్తలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. కుంగిన మూడు పిల్లర్ల వద్ద ఒక కాఫర్ డ్యాం కట్టి నీటిని పంపింగ్ చేస్తే కరువు వచ్చేది కాదన్నారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. గురువారం ఆయన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన పంటపొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. కేసీఆర్ మీద కోపాన్ని రైతుల మీద చూపొద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా రైతులకు లీగల్ నోటీసులిచ్చి బ్యాంక్ రుణం కడతారా, కట్టరా అని మెడలమీద కత్తిపెట్టి బెదిరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారం నుంచి దిగిపోయే ముందు రూ.7వేల కోట్లు రైతుబంధు కింద ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచితే ప్రస్తుత సీఎం వాటిని రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు చెల్లించారని అన్నారు. కౌలురైతులను ఆదుకుంటామని చెప్పి మొండి చేయి చూపుతున్నారన్నారు.

ప్రజలు మోసపోయారు

ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారని కేటీఆర్ అన్నారు. ఏదో మంచి జరుగుతుందనే ఆశతో ఓట్లేశారు.. కానీ ఇప్పుడు తప్పు చేసినట్లు గ్రహించారన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. మేడిగడ్డ రిపేర్ చేసేంత వరకు బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. రైతుల పక్షాన కేసీఆర్ ఉన్నారన్నారు.

కౌలు రైతులను ఆదుకోవాలి

సీఎంకు ఎండిన పంటపొలాలను చూసే తీరికలేదని కేటీఆర్ విమర్శించారు. నాలుగు నెలలుగా 15సార్లు ‘ఎక్కే  విమానం.. దిగే విమానం’ అన్నట్లు ఢిల్లీకి జాతరలు, యాత్రలు చేసుడుతప్ప రైతు పొలాల దిక్కు చూసి పాపాన పోలేదన్నారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని వెంటనే నేరవేర్చాలన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంట నష్టం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎండిన పంట పొలాలకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.