ఘోష్ రిపోర్ట్ కాదు.. ట్రాష్ రిపోర్ట్,,కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర: కేటీఆర్

ఘోష్ రిపోర్ట్ కాదు.. ట్రాష్ రిపోర్ట్,,కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర: కేటీఆర్
  • రిపోర్టును చెత్తబుట్టలో వేసిన బీఆర్ఎస్
  • అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి గన్​పార్క్ వద్ద నిరసన

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తే కేసీఆర్​ను బద్నాం చేయొచ్చన్న కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ రిపోర్టును రూపొందించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంతకుమించి ఆ రిపోర్టులో ఏమీ లేదన్నారు. కాళేశ్వరంపై జస్టిస్​పీసీ ఘోష్ ఇచ్చింది.. ఘోష్ రిపోర్ట్ కాదని, అది ‘ట్రాష్’ రిపోర్ట్ అని అన్నారు. అందుకే ఈ రిపోర్టు కాపీలను చెత్తబుట్టలో వేశామన్నారు. కమిషన్ రిపోర్టుపై న్యాయపోరాటం కొనసాగిస్తామన్నారు. 

కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టాన్ని ఉల్లంఘించి ఈ రిపోర్టును రూపొందించిందని అన్నారు. ఆదివారం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై షార్ట్ డిస్కషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ర్యాలీగా గన్​పార్క్ వద్దకు వెళ్లారు. అక్కడ కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘మేడిగడ్డ రిపేర్లకు రూ.350 కోట్లే ఖర్చవుతుంది. 

ఇది కూడా ఎలాంటి సంస్థ అయినా మేమే ఖర్చు పెట్టి రిపేర్ చేయిస్తామని చెప్తున్నా.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల నష్టం అంటున్నది. చిన్న ప్రమాదాన్ని పెద్దగా చేసి చూపించే కుట్ర చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న కాళేశ్వరంపై కుట్రను ఎండగడతాం’’ అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కాంగ్రెస్​ నేతల కుట్ర ఉందన్న ఆరోపణలున్నాయని అన్నారు. 

మా ప్రసంగాన్ని 33 సార్లు అడ్డుకున్నరు: హరీశ్

ఘోష్ కమిషన్ నివేదికను ఎలా ఇచ్చారో పూర్తిగా అసెంబ్లీలో వివరించామని హరీశ్ రావు అన్నారు. దానిని తట్టుకోలేకే సీఎం, మంత్రులు తమను 33 సార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్​ హయాంలో నీళ్లు ఇవ్వలేదని భట్టి విక్రమార్క అంటున్నారని, కాంగ్రెస్​ ప్రభుత్వం ఒక్క ఎకరానికి నీళ్లిచ్చినట్టు రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని, బీఆర్ఎస్ హయాంలో నీళ్లిచ్చినట్టు ప్రూవ్ చేస్తే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్​ విసిరారు. 

బురద రాజకీయాల కోసమే కాళేశ్వరంపై చర్చ పెట్టారన్నారు.  మంత్రి ఉత్తమ్​ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక కాల్వ, ఒక చెరువు కట్టారా, ఒక ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల కోసమే విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఎ రిపోర్టు, ఘోష్ కమిషన్ రిపోర్ట్ లతో వేధిస్తున్నారని ఆరోపించారు.