ఓట్లు డబ్బాల్లో పడే నాటికి.. 99% రుణమాఫీ చేస్తం : కేటీఆర్

ఓట్లు డబ్బాల్లో పడే నాటికి.. 99% రుణమాఫీ చేస్తం : కేటీఆర్
  • ఓట్లు డబ్బాల్లో పడే నాటికి.. 99% రుణమాఫీ చేస్తం
  • బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్ఐసీ ఏజెంట్లలా ప్రజల్ని ఒప్పించి ఓట్లేయించాలి: కేటీఆర్
  • ఇందిరమ్మ రాజ్యమంటే.. మళ్లీ ఎమర్జెన్సీ తీసుకొస్తరా?
  • సోనియాను బలిదేవత.. రాహుల్‌‌ను పప్పు అన్నది రేవంత్ కాదా?
  • పాలమూరులో ఒక్క మోటారు అన్ చేస్తేనే ప్రతిపక్షాలు ఉక్రోశ పడుతున్నయ్
  • రేపు మొత్తం 31 మోటార్లు ఆన్ చేస్తే వాళ్ల పరిస్థితి ఏమైతదోనని కామెంట్​
  • బీఆర్ఎస్‌‌లో చేరిన రావుల చంద్రశేఖర్​రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, మామిళ్ల

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్తున్నారని.. అంటే మళ్లీ ఎమర్జెన్సీ రోజులు తీసుకువస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ నాన్నమ్మ ఇందిరా గాంధీ.. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను రాచిరంపాన పెట్టారని, అలాంటి వాళ్లు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ‘‘రుణమాఫీ గురించి రాహుల్​నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కరోనాతో రెండేండ్లు లక్ష కోట్ల చొప్పున ఆదాయం కోల్పోయినా హామీలు అమలు చేస్తున్నాం. 19 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.13 వేల కోట్లు మాఫీ చేశాం. 

వచ్చే వారంలో ఇంకో రూ.3 వేల కోట్లు మాఫీ చేయబోతున్నాం. ఓట్లు డబ్బాలో వేసే నాటికి రైతు రుణమాఫీ హామీ 99 శాతం పూర్తి చేస్తాం” అని చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​రెడ్డి, కాంగ్రెస్​నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వేర్వేరుగా​కేటీఆర్​సమక్షంలో బీఆర్ఎస్‌‌లో చేరారు. వారికి కేటీఆర్​కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీని బలిదేవత, రాహుల్ గాంధీని పప్పు అన్నది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. 

‘‘ప్రధాని మోదీ, రాహుల్ పార్లమెంట్ లో కౌగిలించుకోలేదా? కన్ను గీటుకోలేదా? ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయలేదా? మణికొండ, మక్తల్ మున్సిపాలిటీల్లో కలిసి అధికారం పంచుకోలేదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. అలాంటి పార్టీలు వచ్చి తమను ఏదో ఒక పార్టీకి బీ టీమ్​ అంటున్నాయని మండిపడ్డారు. జాతీయ పార్టీలకు కేసీఆర్ కోరుకుడు పడని కొయ్య అని, అందుకే వాళ్లు కేసీఆర్‌‌‌‌ను తెలంగాణకే పరిమితం చేయాలనుకుంటున్నారని అన్నారు.

వండి పెట్టడం, మూతి తుడవడం తప్ప..

పాలమూరులో ఒక్క మోటారు ఆన్ చేస్తేనే ప్రతిపక్షాలు ఇంత ఉక్రోశపడుతున్నాయని.. రేపు మొత్తం 31 మోటార్లు ఆన్ చేస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో, ఎక్కడికి పోతారోనని కేటీఆర్ అన్నారు. ‘‘ప్రపంచంలో ఎత్తయిన కాళేశ్వరం లిఫ్ట్​ నిర్మించుకున్నాం. తమను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటారని రైతులు ధీమాతో ఉన్నారు. రైతుకు పెట్టుబడి సాయం చేయాలన్న ఆలోచన కేసీఆర్‌‌‌‌కు తప్ప ఇంకొకరికి ఎందుకు రాలేదో చెప్పాలి” అని అన్నారు. 

ఉమ్మడి మహబూబ్​నగర్​కు జిల్లాకు ఐదు మెడికల్​కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. ‘‘స్కూళ్లలో సీఎం బ్రేక్​ఫాస్ట్​అమలు చేస్తున్నాం. విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం 2 పూటలా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. మొత్తంగా మూడు పూటలా విద్యార్థులకు సన్నబియ్యం బువ్వపెట్టబోతున్నాం. వండి పెట్టడం, మూతి తుడవడం తప్ప అన్ని పనులు ప్రభుత్వమే చేస్తుంది’’ అని వివరించారు.

కన్నీళ్లను రెట్టింపు చేశారు

70 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ నేతలు ఏం వెలగబెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. వాళ్లకు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ ​గురించి మాట్లాడేప్పుడు తన నాభిలోంచి కోపం వస్తుందని, అందుకే కాస్త గట్టిగానే అంటానన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. దీనిపై దసరా పండుగ రోజు చర్చ పెట్టాలి. బిడ్డకు పెండ్లి చేస్తున్నప్పుడు ఎంత ఆలోచిస్తామో.. రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనే అంశంపైనా అంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఓటేసేప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికిన రేవంత్​ రెడ్డి.. ఎన్నికల్లో డబ్బు పంచం, మద్యం పోయబోమని ప్రమాణం చేయాలని అడగడం హాస్యాస్పదం. హంతకుడే సంతాపసభ పెట్టినట్టు రేవంత్ తీరు ఉంది. బీఆర్ఎస్​కార్యకర్తలు ఎల్ఐసీ ఏజెంట్లలా ప్రజలను ఒప్పించి ఓట్లు వేయించాలి” అని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌‌లో చేరిన తర్వాత రావుల చంద్రశేఖర్​రెడ్డి.. ప్రగతి భవన్‌‌లో కేసీఆర్‌‌‌‌ను కలిశారు.

తెలంగాణ అస్తిత్వంపై దాడి 

తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నదని.. ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా తెగువ ప్రదర్శించాలని కేటీఆర్ కోరారు. జిట్టా బాలకృష్ణా రెడ్డి తిరిగి పార్టీలోకి రావడం తప్పిపోయిన కొడుకు ఇంటికి చేరినట్టుగా ఉందన్నారు. ‘‘తెలంగాణ అస్తిత్వంపై మోదీ, రేవంత్​రెడ్డి దాడి చేస్తున్నారు. నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్​ఈ రోజు కాళీ మాత అంటున్నారు.. పప్పు అన్న రాహుల్​ను నిప్పు అంటున్నారు. ప్రగతిలో ఇంత దూరం తీసుకువచ్చిన రాష్ట్రాన్ని ఈనగాచి నక్కల పాలు చేయవద్దు. వాళ్ల మాటలు విని మోసపోవద్దు’’ అని కోరారు. బీసీ జనగణనపై ఈ రోజు రాహుల్​ మాట్లాడుతున్నారని, తొమ్మిది నెలల క్రితమే తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిందని గుర్తు చేశారు. ‘‘జానారెడ్డి సీఎం అవుతామని అంటున్నారు. కాంగ్రెస్‌‌కు ఐదారుగురు సీఎం అభ్యర్థులు దొరికారు. కానీ ఓటర్లు దొరకలేదు. మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు” అని చెప్పారు. ‘‘ముదిరాజ్‌‌లకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించింది బీఆర్ఎస్సే. ఈటలకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చింది మా పార్టీనే. సిట్టింగులకే టికెట్లు ఇవ్వడంతో వారికి చాన్స్​ ఇవ్వలేకపోయాం మిగతా పదవుల్లో ముదిరాజ్​లకు ప్రాధాన్యం ఉంటుంది”అని అన్నారు.

అభివృద్ధి కోసమే : రావుల

కేటీఆర్​ దూరదృష్టి గల నేత అని రావుల చంద్రశేఖర్​రెడ్డి అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్​వరకు అన్ని చూశానని, తనకు తెలియని పదవులు కావని పాలమూరు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్​లో చేరుతున్నానన్నారు.

సొంతింటికొచ్చిన: జిట్టా

14 ఏండ్ల వనవాసం తర్వాత సొంటింటికి వచ్చినట్టు ఉందని జిట్టా బాలకృష్ణా రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని, ఉద్యమకారులను ఏకం చేస్తానన్నారు. ఉద్యమకారులందరూ మళ్లీ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు.

రాజీనామా చేసి: మామిళ్ల

రెండేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్​లో చేరుతున్నానని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​అన్నారు. ముదిరాజ్ బిడ్డగా ముదిరాజ్ కులానికి న్యాయం చేయడానికే పార్టీలోకి వెళ్తున్నానని తెలిపారు.