420లతో చర్చకు రాను

420లతో చర్చకు రాను

420లతో చర్చలు జరపనని తెలిపారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన ట్విట్టర్ లో (ASK KTR) ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్న రేవంత్ సవాల్‌పై కేటీఆర్ ఇలా స్పందించారు. రేవంత్ తో తాను డిబేట్ చేయబోనని స్టీఫెన్ సన్ తో ఆయన చర్చించాలని సూచించారు. గంటసేపు ప్రజల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే.. సమాధానాలివ్వడంలో కూడా.. చాలా టాక్టిక్ గా వ్యవహరించారు కేటీఆర్. చిన్నవి మినహా.. ఇతర సమస్యలపై వచ్చిన ట్వీట్లకు ఆన్సర్ ఇవ్వలేదు. ప్రభుత్వం చేసిన పనులు, పొలిటికల్ ఇష్యూలపై మాత్రమే స్పందించారు. యూపీ ఎన్నికలపైనా స్పందించిన అక్కడ సమాజ్ వాదీ పార్టీ వేవ్ కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన 317 జీవోపైనా చాలామంది మంది కేటీఆర్ ను ప్రశ్నించారు.

జీవో రద్దు చేయాలని, లేకపోతే సవరణలు చేయాలని కోరారు. కానీ కేటీఆర్ మాత్రం రెస్పాండ్ కాలేదు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి సమస్యలపై కేటీఆర్ స్పందించలేదు. ఇటీవల టీఆర్ఎస్ నేతల కొవిడ్ ఉల్లంఘనలపై వచ్చిన ప్రశ్నలను కేటీఆర్ పట్టించుకోలేదు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు కేంద్రం నిధులివ్వలేదన్నారు కేటీఆర్. మరోవైపు..  ఈ ఏడాది ఏప్రిల్ వరకు టీ ఫైబర్ ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందని చెప్పారు. కమలాపూర్ బిల్ట్ పరిశ్రమల రీ ఓపెన్ కు చాలా ప్రయత్నించామని.. కానీ అది సాధ్యపడలేదన్నారు. 
 

 

యూపీ ఎన్నికల్లో ఎస్పీ పక్షాన ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు.. సంప్రదింపుల తర్వాత చెబుతానని అన్నారు. ఇప్పటికిప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే యూపీలో ఎస్పీ వైపు ఉందని కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో పలు రోడ్లు మూసివేతపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఈ అంశంపై పార్లమెంటులో పోరాటం చేస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిని, హెరిటేజ్ సైట్లను ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని మరో నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించాడు. అందుకాయన బదులిస్తూ, "నీకెవరో తప్పుడు సమాచారం అందించారు మిత్రమా! ఓసారి ఇటీవల జరిగిన అభివృద్ధిని గమనించు" అన్నాడు. హీరో సూర్యపై మీ ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పండని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అందుకు కేటీఆర్ స్పందిస్తూ, "అద్భుతమై నటుడు' అని కితాబిచ్చారు. కేటీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తారా అన్న ప్రశ్నకు.. తాను తెలంగాణకు సేవ చేయడంలో హ్యాపీగా ఉన్నానని కేటీఆర్‌ తెలిపారు.