
- రేవంత్‌ను గెలిపించుకున్నందుకు ప్రజలకు బూడిదే మిగిలిందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వద్దనే చర్చ పెడ్తామని, సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీళ్లు, నియామకాల విషయంలో చర్చకు ప్రెస్ క్లబ్‌కు రమ్మంటే.. రేవంత్ పారిపోయారని విమర్శించారు. కానీ, అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు మరోసారి నాగార్జునసాగర్ కట్టమీద చర్చకు వస్తావా అంటూ అడుగుతున్నారని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన దళితబంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘నాగార్జున సాగర్ కట్ట మీద కాదు.. మేడిగడ్డ బ్యారేజీ మీద చర్చించుకుందాం.. రా.. తుంగతుర్తి, సూర్యాపేట, నియోజకవర్గం చివరి మడి వరకు నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్ అని రేవంత్‌కు తెలిసినా అబద్ధాలు చెబుతున్నారు.
సీఎంగా ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే.. తనను ఇప్పటికీ దొంగలాగే చూస్తున్నారని సీఎం అనడం సిగ్గుచేటు” అని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో ప్రజలు ఏం చేయాలో అదే చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమన్నారు. దళితులు ఒక్క దళితబంధు కోసమే కాకుండా.. మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలన్నింటిపైనా నిలదీయాలన్నారు.
ముసుగు వీడింది..
సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన ముసుగు వీడిందని కేటీఆర్ అన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు వెళ్తే.. తెలంగాణ వ్యతిరేకిని సీఎంగా గెలిపించుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు బూడిదే మిగిలిందన్నారు. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి.. గురుదక్షిణగా గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. కోవర్టులు ఎవరో.. తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు ఎవరో ఈ రోజుతో తేలిపోయిందన్నారు. ఆయన గురువుపై విశ్వాసం చూపించేందుకు తెలంగాణ విధ్వంసం కావాలా అని కేటీఆర్ ప్రశ్నించారు.