
- సీఎం రేవంత్ తప్పించుకుని ఢిల్లీకి పారిపోయిండు: కేటీఆర్
- సీఎం రాకుంటే కనీసం మంత్రులైనా వస్తారనుకున్నం
- ఆయనకు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదు
- ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం.. ప్లేస్, డేట్ ఫిక్స్ చేయాలని సీఎంకు సవాల్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ విమర్శించారు. రైతుల గురించి బేసిక్నాలెడ్జ్లేని రేవంత్అసమర్థ పాలనతో 18 నెలల నుంచి రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు, నిరుద్యోగులకు ఎవరేం చేశారో చర్చించేందుకు రమ్మంటే సీఎం రేవంత్ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. చర్చించే సత్తా లేనప్పుడు సవాళ్లు విసరడం ఎందుకు? అని ప్రశ్నించారు. చర్చకు రాకపోతే ముక్కు నేలకు రాసి భేషరతుగా కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. రైతు భరోసా డొల్ల అని, సీఎం రేవంత్సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే 670 మందికి రైతు భరోసా రాలేదని ఆరోపించారు. ‘‘రుణమాఫీ కాని లక్షలాది మంది అర్హుల జాబితా మా వద్ద ఉంది. రేవంత్‌పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల లిస్టు కూడా ఉంది. సీఎం లేదా మంత్రులు వస్తే ఆ జాబితా ఇచ్చేవాడిని. సీఎం చాలా బిజీగా ఉంటారన్న విషయం మాకు తెలుసు. అందుకే మరొక అవకాశం ఇస్తాం. ప్లేస్, డేట్, టైమ్ఆయనే డిసైడ్చేస్తే.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధం” అని సవాల్ విసిరారు.
మాట తప్పడం రేవంత్‌కు అలవాటే..
సీఎం రేవంత్‌కు బేసిక్ నాలెడ్జ్ లేదని, అందుకే చర్చకు ప్రిపేర్ అయ్యేందుకు ఆయనకు 72 గంటల సమయం కూడా ఇచ్చామని కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ ఆయన రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. కనీసం బాధ్యత కలిగిన డిప్యూటీ సీఎం గానీ, వ్యవసాయ శాఖ మంత్రి గానీ, ఇంకెవరైనా మంత్రి గానీ వస్తారని అనుకున్నామని.. కానీ వాళ్లు కూడా రాలేదన్నారు. ‘‘తొడలు కొట్టడం, రంకెలు వేయడం, సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్‌కు అలవాటే. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మాట తప్పారు” అని మండిపడ్డారు. ‘‘18 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఒక ఆధార్కార్డ్మీద ఇచ్చే ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా కోసం రైతులు ఎరువుల దుకాణం ముందు చెప్పులు క్యూలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు సున్నం పెడుతూ తన గురువు చంద్రబాబు కోసం కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి రేవంత్ తరలిస్తున్నారు. గోదావరి నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించేందుకు కడుతున్న బనకచర్లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్లు మూసుకొని చంద్రబాబు కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుతున్నారు. ఆంధ్రకు నీళ్లు, ఢిల్లీకి నిధులను పంపుతూ.. తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకుంటున్నారు. కాంగ్రెస్అగ్రనాయకత్వంతో పాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలకూ రేవంత్ మూటలు మోస్తున్నారు” అని
ఆరోపించారు.
మళ్లీ ఎమర్జెన్సీ పాలన..
ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలుకు తమది గ్యారంటీ అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్.. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేకపోయిందని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును రీట్వీట్ చేసినా రేవంత్సర్కార్ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే వణికిపోతున్న రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్నారు.