ఎలక్షన్ల కోసమే కేటీఆర్ రివ్యూలు

ఎలక్షన్ల కోసమే కేటీఆర్ రివ్యూలు

ఇంతకు ముందు అబద్ధాలు చెప్పి గ్రేటర్‌లో గెలిచిన్రు: రేవంత్ రెడ్డి 

టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ జనంలోకి..: పొన్నం 

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు మరో ఆరు నెలల్లో ఉన్నందునే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షల పేరుతో హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ను ఇస్తాంబుల్ చేస్తామని, ట్యాంక్ బండ్ నీళ్లను కొబ్బరి నీళ్లు చేస్తామని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా, ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వపోతే ఓట్లు అడగమని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అబద్ధాలు ఆడి 99 మంది కార్పొరేటర్లను గెలుచుకున్నారని రేవంత్ అన్నారు. గ్రేటర్ లో 128 ఇండ్లు మాత్రమే కట్టారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడంతో కిరాయిల రూపంలో పేదల పై రూ.1,200 కోట్ల భారం పడిందన్నారు. లాక్ డౌన్ టైమ్ లో కరెంట్ బిల్లులు, ఇంటి ట్యాక్స్ లతోనూ భారం పడిందన్నారు. కేటీఆర్ బంధువుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని  ఆరోపించారు. సచివాలయం కూల్చుడు, ప్రగతి భవన్ కట్టుడు తప్పా కేసీఆర్ ఏమీ చేయలేదన్నారు. మున్సిపల్ మంత్రిగా ఫెయిలైన కేటీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కేటీఆర్ ముక్కు మూసుకోకుండా మూసీ వెంట తిరగాలని రేవంత్ సవాల్ విసిరారు. వచ్చే నెల 3 నుంచి మల్కాజిగిరి పరిధిలో డివిజన్ యాత్ర ప్రారంభిస్తానని రేవంత్ వెల్లడించారు.

కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలె..

జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. వరంగల్ పర్యటనలో కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని..  కానీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వని కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.