క్యాష్ ఫర్ ట్వీట్ : చంద్రబాబు మళ్లీ ఇరుక్కున్నారన్న కేటీఆర్

క్యాష్ ఫర్ ట్వీట్ : చంద్రబాబు మళ్లీ ఇరుక్కున్నారన్న కేటీఆర్

ట్విట్టర్ లో కొందరికి డబ్బులిచ్చి తెలంగాణను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణను అప్రతిష్టపాలుచేసే దుష్ట పన్నాగాలు పన్నుతోందని ట్విట్టర్ లో విమర్శించారు. ట్విట్టర్ లో పెయిడ్ హ్యాండిల్స్ ను ఉపయోగించి… తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఫేక్ హ్యాండిల్స్ నుంచి ట్వీట్లను కొనుగోలు చేయగలరు కానీ… నిజమైన ఓట్లను కొనుగోలుచేయలేరని అన్నారు. గతంలో క్యాష్ ఫర్ ఓట్స్ స్కామ్ లో దొరికిపోయిన చంద్రబాబు.. ఇపుడు “క్యాష్ ఫర్ ట్వీట్” లోనూ దొరికిపోయారని విమర్శించారు కేటీఆర్.

ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా రహస్యంగా ఉండాల్సిన సిటిజన్ డేటా అంతా దొరకడం… సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందంటూ పోలీసులు చెప్పడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆదివారం నాడు ట్విట్టర్ లో #TSGovtStealsData అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ఈ హ్యాష్ ట్యాగ్ పై వచ్చిన ట్వీట్లను టీఆర్ఎస్ ఐటీ వింగ్ డీకోడ్ చేసింది.

అసలు ఆంధ్రతో కానీ, తెలంగాణతో కానీ ఏ సంబంధం లేని కొన్ని వేల ట్విట్టర్ అకౌంట్ల నుంచి ఈ ట్వీట్లు వచ్చాయని టీఆర్ఎస్ అంటోంది. “అనేక హ్యాండిల్స్ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారు చేసినవి. ఇందులో తెలుగులో వచ్చిన ట్వీట్లు కూడా అసలు తెలుగు భాష రాని వారి ట్విట్టర్ అకౌంట్ల నుండి పోస్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఈ ట్విట్టర్ హ్యాష్ ట్యాగును కృత్రిమంగా ట్రెండ్ చేయడానికి ఒక ఏజెన్సీకి భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పిందని, వారు వేలాది ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కిరాయికి మాట్లాడుకుని ఈ ట్వీట్లను చేయించారని తెలిసింది. బొంబాయికి చెందిన రియా అనే ఒక మోడల్… సంతోష్ షుక్లా అనే యాక్టర్…., బాలీవుడ్ చోక్ అనే గురుగ్రాం ట్విట్టర్ అకౌంట్… వీళ్లందరూ ఈ అంశం గురించి, చంద్రబాబుకు మద్ధతుగా ట్వీట్ చేశారు. గమ్మత్తేమిటంటే ఈ ట్విట్టర్ అకౌంట్లు అన్నిటిలో ఒకే విధమైన ట్వీట్లు ఉన్నాయి. ఈ ట్వీట్లు చేసిన వారందరూ రోజూ ఎవరు డబ్బులు ఇస్తే వారికి ట్వీట్ లు చేసిపెట్టే కిరాయి మనుషులు. ఒక తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద ఎదురుదాడికి చంద్రబాబు, లోకేశ్ చేసిన ప్రయత్నం ఇది. అలా.. చంద్రబాబు… క్యాష్ ఫర్ ట్వీట్ స్కాములో మరోసారి బుక్కయ్యారు” అని గులాబీ వర్గాలు చెప్పాయి. కేటీఆర్ పోస్ట్ చేసిన ఆర్టికల్ సారాంశం కూడా ఇదే.