
హైదరాబాద్, వెలుగు: వరుసగా 2 నెలల పాటు రాష్ట్ర ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) మైనస్‌లోకి పోవడం ఆర్థిక వ్యవస్థ పతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్ల పాటు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, కేవలం 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలతోనే తెలంగాణకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు.
తెలంగాణ చరిత్రలో తొలిసారి జూన్, జులై ద్రవ్యోల్బణం మైనస్‌లో నమోదైందని పేర్కొన్నారు. జులైలో ద్రవ్యోల్బణం – -0.44%గా ఉండగా, జాతీయ సగటు +2.10శాతంగా ఉందని తెలిపారు. జూన్‌లో రాష్ట్రంలో – -0.93 శాతంగా ఉంటే, దేశవ్యాప్తంగా +1.55 శాతంగా ఉందని చెప్పారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలన్నీ స్తంభించిపోయాయని పేర్కొన్నారు.