- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కంపెనీ కావడం వల్ల చర్యలు తీసుకోవడం లేదా..? లేదంటే సీఎం పాత్ర ఉందని తీసుకోవడం లేదా? అని నిలదీశారు. పొంగులేటిని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని, లేదంటే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్మాట్లాడుతూ అక్రమాలు జరిగాయని అంగీకరించారని, వాటిని ప్రభుత్వమే బయటపెట్టడంతో ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరపు బంధువులదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2020–22 వరకు ఆయనే దానికి చైర్మన్‌గా ఉన్నారని, మంత్రి భార్య, కొడుకు, తమ్ముడికి కంపెనీతో సంబంధం ఉందని ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో సీఎం పాత్ర కూడా ఉన్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆ కంపెనీకి అప్పగించడం, రాష్ట్రంలో జరుగుతున్న భూదందాల నేపథ్యంలో మంత్రి, ఆయన అనుచరులపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
రెండోసారి నోటీసులిస్తే చట్టప్రకారం ఏడాది జైలు శిక్ష పడుతుందన్నారు. కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ కంపెనీ కూడా సీఎం బంధువులకు చెందినదేనని చెప్పారు. మైనింగ్ రెవెన్యూ పెరిగిందని ప్రభుత్వం చెప్తున్నా.. వాస్తవంగా రావాల్సిన రూ.1800 కోట్లలో కేవలం రూ.900 కోట్లే వస్తున్నాయన్నారు. మిగిలిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో బీజేపీ సభ్యులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా, రూ.22 వేల కోట్ల మెట్రో ఆస్తిని కేవలం రూ.15 వేల కోట్లకే కొనుగోలు చేశామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.
