V6 News

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టండి : కేటీఆర్

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టండి : కేటీఆర్
  •     లేదంటే హైదరాబాద్ లో మహాధర్నా చేస్తా: కేటీఆర్​
  •     రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులను సంఘటితం చేస్తానని వెల్లడి
  •     సిరిసిల్లలో ఆటో డ్రైవర్ లకు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్​చేశారు. వచ్చే బడ్జెట్ లోగా ఏర్పాటు చేయకపోతే హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తానని ఆయన హెచ్చరించారు. 

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో వ్యక్తిగతంగా ఆటో డ్రైవర్ లకు ఇన్సూరెన్స్ బాండ్ల ను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 8వేల మంది ఆటో కార్మికులందరికీ ప్రమాద బీమా చేయిస్తానని ప్రకటించారు. గత కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించామన్నారు. 

తెలంగాణలో అసంఘటిత రంగంలో ఉన్న పదమూడున్నర లక్షల మందికి ప్రమాద కల్పించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ప్రపంచంలో రైతలందరికీ ప్రమాద బీమా కల్పించింది కేసీఆర్ ఒక్కరేనని, కార్మిక, ధార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో నేత, గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించామన్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం అయ్యి ఉంటే రాష్ట్రమంతా ప్రతి కుటుంబానికి ‘కేసీఆర్ బీమా’ పేరిట ఇన్సూరెన్స్ కల్పించేవారమని చెప్పారు. రాష్ట్రంలో బీడీలు చుట్టే మహిళలకు రూ.2వేల పింఛన్ ఇచ్చింది కేసీఆరే అన్నారు. 

ఆటోలు అమ్ముకుంటున్నరు

ఆటో కార్మికులు ఆటోలను అమ్ముకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయాలంటే రూ.50 వేల కోట్లు అవసరం ఉంటే.. రేవంత్ సర్కార్ కేవలం రూ.12 వేల కోట్లు చెల్లించి ఏదో కొంత మంది రైతులకు మాఫీ చేసి మొత్తం చేసినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఆటో కార్మికులకు నెలకు రూ. వెయ్యి ఇస్తానని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఒక్క కార్మికుడికి కూడా రూపాయి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆటో కార్మికుడికి రెండేండ్లకు రూ.24 వేల చొప్పున బకాయి ఉందని, వీటిని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కేటీఆర్​డిమాండ్ చేశారు.