హైదరాబాద్, వెలుగు: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, అధికారికంగా తన పేరును ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోవాలని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇచ్చే జాతీయ నినాదం ‘మొహబ్బత్ కీ దుకాన్’ కాస్తా.. తెలంగాణలో ‘హిట్లర్ కా మకాన్’గా మారిపోయిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ చేసిన హిట్లర్ వ్యాఖ్యలు వారి ఫాసిస్టు ఆలోచనా విధానానికి నిదర్శనమని సోమవారం ‘ఎక్స్’లో కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ తన మౌనాన్ని వీడాలన్నారు. సీఎంని మందలించకపోతే, ఆ నియంతృత్వ పద్ధతులను అధిష్టానం సమర్థించినట్లే అవుతుందని హెచ్చరించారు.
“డియర్ రాహుల్ గాంధీ.. మీ మొహబ్బత్ కీ దుకాన్ అధికారికంగా హిట్లర్ కా మకాన్ అయిందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా హిట్లర్‌ను కీర్తిస్తూ, అతని హంతక ముఠాలను పాలనా స్ఫూర్తిగా పేర్కొంటుంటే.. మీరు మౌనంగా ఉంటూ, రాజ్యాంగానికి స్వయంప్రకటిత రక్షకుడినని ఎలా చెప్పుకుంటారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక ప్రజాస్వామ్య నాయకుడు నిజమైన రాజనీతిజ్ఞుల నుంచి స్ఫూర్తి పొందుతారని, అధికారం తలకెక్కిన, పారనాయిడ్ పాలకుడు మాత్రమే నియంతల నుంచి పాఠాలు వెతుక్కుంటారని వ్యాఖ్యానించారు.
