నెరవేరని KTR హామీ.. వృద్ధురాలికి రేకుల షెడ్డు వేయించిన జనం

నెరవేరని KTR హామీ.. వృద్ధురాలికి రేకుల షెడ్డు వేయించిన జనం

తనకి డబుల్ బెడ్ రూం నిర్మిస్తానని కేటీఆర్ హామీ ఇవ్వడంతో మురిసిపోయారు ఆ వృద్దదంపతులు. గుడిసెకి 500 ట్యాక్స్ పేరుతో వచ్చిన కథనానికి అప్పట్లో కేటీఆర్ తన ట్విట్టర్ లో స్పందించారు. కేటీఆర్ హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా నెరవేరలేదు. ఆ వృద్దుడు సొంతింటి కల నెరవేరకుండానే కళ్లుమూశాడు. బతికున్న ముసలమ్మ బాధలు చూడలేక స్థానికులే రేకులతో షెడ్ నిర్మించి ఇచ్చారు.

కుమ్రం భీం జిల్లా కర్జవెల్లి గ్రామంలో గత సంవత్సరం పంగిడి చీకటి – పంగిడి బాయక్క అనే వృద్ద దంపతుల పూరి గుడిసెకు రూ. 500 పన్ను వేశారు అధికారులు.  వృద్ద దంపతుల్లో ఒకరికి వస్తున్న పింఛన్ నుండి డబ్బులు కట్ చేసుకున్నారు. దీంతో ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. దానికి స్పందించిన కేటీఆర్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ వృద్ద దంపతులకి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీచేశారు. కేటీఆర్ ఆదేశాలు జారీ చేసి ఏడాది గడిచినా ఆ వృద్ద దంపతులు పూరి గుడిసె మారలేదు. చివరకు డబుల్ బెడ్ రూం ఇంటి కల నేరవేరక ముందే వృద్ధుడైన పంగిడి చీకటి కన్ను మూశాడు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హామీని కూడా అధికారులు నెరవేర్చకపోవడం బాధాకరమంటున్నారు స్థానికులు.

పంగిడి చీకటి మరణంతో ఆయన భార్య బాయక్క ఒంటరైంది. అదే పూరి గుడిసెలో నివసిస్తుండటంతో.. స్థానికుల మనసు చలించి తలో చేయి వేసి ముసలావిడకి ఓ రేకుల షేడ్ నిర్మించి ఇచ్చారు. రాజకీయ లబ్దికోసమే ఇలాంటి హామీలిచ్చారని.. చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇప్పటికే ఆ వృద్ద దంపతులు సంతోషంగా డబుల్ బెడ్ రూం ఇంటిలో ఉండేవారని అంటున్నారు స్థానికులు.

స్థానికులు నిర్మించిన రేకుల షెడ్డులో దీనావస్థలో ఉన్న వృద్ధురాలిని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.