అబద్ధాలు చెప్పడంతో కేటీఆర్‌ తండ్రిని మించిపోయారు: అర్వింద్

అబద్ధాలు చెప్పడంతో కేటీఆర్‌ తండ్రిని మించిపోయారు: అర్వింద్

టీఆర్ఎస్ ప్రభుత్వం…మంత్రి కేటీఆర్ వ్యవహార తీరుపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. రాష్ట్రంలో వరద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.224 కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ.202 కోట్లు మంజూరు చేసిందన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే టీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులకు రూ.10వేలు ఇస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు చెప్పడంతో కేటీఆర్‌… తండ్రిని మించిపోయారన్నారు. విపత్తులు వచ్చినపుడు ఏంచేయాలో ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాలని సూచించారు.

మోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు 2లక్షల ఆక్రమణలు తొలగించారని.. ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 90 శాతం సీట్లు సాధించిందని గుర్తు చేశారు. ఎన్నికలు రాగానే కేటీఆర్‌కు డబుల్‌ డెక్కర్‌ బస్సులు గుర్తొస్తాయని అర్వింద్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామంటే.. కేంద్రం ఇచ్చిన అదనపు నిధులపై చర్చకు సిద్ధమన్నారు. వచ్చేఎన్నికల్లో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కు ఓటమి తప్పదని.. తెలంగాణకు ఆయన మరో రాహుల్‌ గాంధీ అని అన్నారు. దుబ్బాక ప్రజలు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి ఎలా ఉంటుందో చూపించారన్నారు. సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్యలుంటాయన్నారు అర్వింద్.