తుస్సుమనిపించిన కేటీఆర్ టూర్.!

తుస్సుమనిపించిన కేటీఆర్ టూర్.!
  • సూచనలకే పరిమితమైన లీడర్ల మీటింగ్
  • చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయిన చిన్న బాస్
  • ప్రారంభోత్సవాలు, ప్రతిపక్షాలపై విమర్శలు

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్​ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఖమ్మం టూర్​ తుస్సుమనిపించింది. ఉమ్మడి జిల్లా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉండడం, ఒకరిపై ఒకరు రెగ్యులర్​ గా కంప్లైంట్లు చేసుకోవడం, పదవులు దక్కని నేతల అసంతృప్త స్వరాల నేపథ్యంలో కేటీఆర్​ పర్యటనలో వీటన్నింటికి చెక్​ పెట్టేలా చర్యలుంటాయని ఆ పార్టీ కార్యకర్తలు ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఒక రోజు మొత్తం నగరంలో పర్యటించిన కేటీఆర్​ కేవలం పార్టీ ఆఫీస్​లో ఉమ్మడి జిల్లా లీడర్ల మీటింగ్ ను కేవలం కొన్ని సూచనలకే  పరిమితం చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఇంట్లో లంచ్​ మీటింగ్ కు కేటీఆర్​ అటెండయ్యారు. ఆ తర్వాత జిల్లా టీఆర్ఎస్​ ఆఫీస్ లో ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నేతలతో ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటుచేశారు. ఇతర లీడర్లతో మాట్లాడించకుండా, తాను మాత్రమే మాట్లాడారు. ఈనెల 19న జాతీయ పార్టీ ప్రకటన ఉండబోతోందని, ఈలోగా హైదరాబాద్​ లో మళ్లీ సమావేశం అవుదామంటూ నేతలకు సమాచారమిచ్చారు. 40 నిమిషాల మీటింగ్ తర్వాత కేటీఆర్​ హైదరాబాద్​ వెళ్లిపోయారు. అయితే ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎదురుగా మాజీ మంత్రి తుమ్మల అనుచరులు జై తుమ్మల, జైజై తుమ్మల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక కేటీఆర్​ తో మీటింగ్ లో విశేషాలు ఏమీ లేవంటూ ఒక సీనియర్​ నేత కామెంట్ చేయడం గమనార్హం. 
 

వాడుతున్న ఆఫీస్ కే మళ్లీ ప్రారంభోత్సవం
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇప్పటికే ప్రారంభమై, జనాలు ఉపయోగిస్తున్న వాటికే మళ్లీ ప్రారంభోత్సవాలు చేయించడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా నిర్మించిన మున్సిపల్ కార్పొరేషన్​ భవనాన్ని ఏప్రిల్ నెలలో కేటీఆర్ ప్రారంభించాల్సి ఉండగా, అప్పట్లో ఆయన పర్యటన వాయిదా పడింది. దీంతో ఏప్రిల్ 18న మంత్రి పువ్వాడ అజయ్​ కార్పొరేషన్​ భవనంలో పౌరసేవలను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్​ ఆదర్శ్​ సురభిని ఆయన ఛాంబర్​లో కూర్చోబెట్టి, ఆ రోజు నుంచి అక్కడే ఆఫీస్​ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మేయర్​ తన ఛాంబర్​ లో కూర్చోవడం తప్పించి, కొత్త ఆఫీస్​ నుంచే మిగిలిన కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు. ఇక లకారం ట్యాంక్​బండ్​ పై రూ.9 కోట్లతో నిర్మించిన సస్పెన్షన్​ బ్రిడ్జి పైకి కూడా రెండు నెలల నుంచే పబ్లిక్​ను అనుమతిస్తున్నారు. ఇప్పటికే జనం వినియోగిస్తున్న బ్రిడ్జిని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. 
 

కార్పొరేటర్లకు ఖర్చులు తడిసి మోపెడు
ఖమ్మం నగరంలో ఈ ఏడాది మంత్రి కేటీఆర్​ పర్యటన మూడు సార్లు వాయిదా పడి, చివరికి నాలుగోసారికి పూర్తయింది. జనవరిలో ఒకసారి, ఏప్రిల్ నెలలో రెండు సార్లు కేటీఆర్​ టూర్​ ఖరారు అయ్యింది గులాబీ మయం కావాలని ఆదేశాలు రావడంతో చిన్న లీడర్ల జేబులు గుల్లయ్యాయి. చోటా మోటా లీడర్లు, కార్పొరేటర్లు వేలాది రూపాయలు ఖర్చు చేసి నగరం అంతా ఫెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నాయకుడు కనీసం రూ.50 వేలకు పైగా ఖర్చుపెట్టిన తర్వాత వాయిదా పడడంతో అవన్నీ నిరుపయోగంగా మారాయి. మళ్లీ ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టాల్సి రావడం, వీటికి అదనంగా సర్దార్​ పటేల్ స్టేడియంలో జరిగిన మీటింగ్ కు పబ్లిక్​ను సమీకరించాల్సిన బాధ్యత కూడా కార్పొరేటర్లకు, డివిజన్​ స్థాయి నాయకులకు అప్పగించడంతో తలలు పట్టుకున్నారు. ఖమ్మం నియోజకవర్గ స్థాయి పబ్లిక్​ మీటింగ్ కావడంతో నగరంలోని అన్ని డివిజన్ల నుంచి, రఘునాథపాలెం మండలం నుంచి మాత్రమే జనాన్ని సమీకరించారు. అసలే ఎండలు మండుతుండడం, మిట్ట మధ్యాహ్నం సభను ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇచ్చి మీటింగ్ కు రప్పించినట్లు సమాచారం. టేకులపల్లి డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల లబ్దిదారులకు కూడా స్కూల్ బస్సులు ఏర్పాటు చేసి మీటింగ్ కు తరలించారు. అసలు పార్టీ మీటింగ్ లకు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసి, 
కార్యకర్తలను తీసుకెళ్లడంపై కూడా విమర్శలు 
వ్యక్తమయ్యాయి. 

ఫ్లెక్సీలు కనిపించలేదా సార్.! 
కేటీఆర్​ ఎక్కడైనా ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. గతేడాది కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వచ్చిన సమయంలో కూడా అప్పటి నగర టీఆర్ఎస్​ అధ్యక్షుడు కమర్తపు మురళికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు గాను రూ.1 లక్ష జరిమానా విధించారు. అదే రోజు ఇల్లందు పర్యటనలో అక్కడి మున్సిపల్ చైర్మన్​ కు కూడా రూ.1లక్ష ఫైన్​ వేశారు. కానీ శనివారం నగరంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను కేటీఆర్​ పట్టించుకోనట్లు కనిపించింది. బహిరంగ సభ ఏర్పాటు చేసిన సర్దార్​ పటేల్​ స్టేడియం బయట కూడా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఉన్నాయి. వీటిని కేటీఆర్​ చూసీ చూడనట్టు వ్యవహరించడంపై పర్యావరణ ప్రేమికుల నుంచి విమర్శలు వస్తున్నాయి.