తొమ్మిదిన్నరేండ్ల పాలనపై ఇవాళ బీఆర్ఎస్ స్వేదపత్రం

తొమ్మిదిన్నరేండ్ల పాలనపై ఇవాళ బీఆర్ఎస్  స్వేదపత్రం

హైదరాబాద్, వెలుగు:  తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, బీఆర్ఎస్​ చేసిన అభివృద్ధిపై శనివారం తెలంగాణ భవన్​లో ‘స్వేదపత్రం’ పేరుతో పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ ఇవ్వనున్నట్లు  ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తెలిపారు. శుక్రవారం సోషల్ మీడియాలో కేటీఆర్​ ఈ మేరకు పోస్ట్ చేశారు. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని తెలిపారు. రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడి చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహింబోమని, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమన్నారు. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను స్వేదపత్రం ప్రజంటేషన్​లో వివరిస్తామన్నారు. ఉదయం 11 గంటలకు ఈ ప్రజంటేషన్​ ఉంటుందన్నారు.

ఆటోడ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్​ కమిటీ

రాష్ట్రంలో ఆటోడ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్టడీ చేయడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్​ కార్మిక విభాగం నేతలు రూప్​సింగ్, రాంబాబు యాదవ్, మారయ్యలతో ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.