- మహిళలను కోటీశ్వరులను చేశారా?
- నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
- ప్రతి లబ్ధిదారునికి రేవంత్ సర్కార్
- రూ. 1.25 లక్షలు బాకీ
- పాలమూరుకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని విమర్శించారు. తమను పట్టించుకోనందుకే కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను నిరుద్యోగులు ఊడగొట్టారన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని.. ఆ హామీని నెరవేర్చినట్టయితే నిరూపించాలన్నారు. నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేదంటే రేవంత్ రాజీనామాకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం.. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ పడిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని విమర్శించారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయని, ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారన్నారు. పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం.. హైడ్రా పేరుతో ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమన్నారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనకు మిగిలింది ఎండ్ కార్డేనని అన్నారు. కాగా, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సీటు రాకుండా సీఎం రేవంత్ కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు. అడ్డగోలు అవినీతి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినందుకే.. హైదరాబాద్‌లో ఆమెపై దొంగ కేసు పెట్టించారన్నారు. దీనిపై ఆమెకు సమాచారం కూడా లేదని, నామినేషన్ వేశాక ఈ విషయాన్ని బీజేపీకి చెప్పి నామినేషన్ రిజెక్ట్ అయ్యేలా చేశారన్నారు.
పాలమూరుకు కాంగ్రెస్ అన్యాయం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారన్నారు. దాదాపుగా పూర్తయిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమీషన్లు, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా సీఎం చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. గతంలోలాగానే మళ్లీ కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ, పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.
