
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సోమవారం (సెప్టెంబర్ 8) తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కవిత ఇష్యూపై కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత ఎపిసోడ్ ముగిసింది.. ఆమె వ్యాఖ్యలపై పార్టీలో చర్చించి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. కవితపై చర్యలకు తీసుకున్నాక ఇక ఆ ఇష్యూపై మాట్లాడేదేమి లేదని తేల్చి చెప్పారు.
పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడటం, పార్టీ కీలక నేతలపై విమర్శలు చేశారన్న కారణంతో బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి హరీష్ రావు, సంతోష్ రావే కారణమని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
ALSO READ : ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనటం లేదు
ఈ ఇద్దరూ అవినీతి అనకొండలు అన్న కవిత.. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే తన తండ్రి కేసీఆర్‌కు అవినీతి మరక అంటుకుందన్నారు. కవిత తనపై ఆరోపణలు చేసిన సమయంలో లండన్‌లో ఉన్న హరీష్ రావు తిరిగి వచ్చాక ఆమె కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. తన జీవితం తెరిచిన పుస్తకమని.. తనపై చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ నార్మల్‌గా స్పందించారు హరీష్ రావు. కవిత ఇష్యూపై ఇప్పటి వరకు ఆమె తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ బహిరంగంగా ఎక్కడ రియాక్ట్ కాలేదు. తాజాగా తన సోదరి కవిత ఇష్యూపై కేటీఆర్ నోరు విప్పారు.