
- పార్టీ ప్రజాప్రతినిధులతో జూబ్లీహిల్స్ బైపోల్సన్నాహక మీటింగ్
హైదరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నాహక, భద్రాచలం నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్‌తో చర్చించారు.
మంత్రి పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యారా?
లక్కీ లాటరీ తగిలినట్టు మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెద్దగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌విమర్శించారు. ఏడాది కింద పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల గురించి కేంద్రం గానీ, ఆయన గానీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆ దాడుల్లో దొరికిన డబ్బులు ఎన్నో ఎవరూ చెప్పడం లేదన్నారు. మరి పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యాడా? లేదా బీజేపీతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డితో పొంగులేటి కలిసిపోయడా? అని ప్రశ్నించారు.
పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడడం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. బీజేపీది నకిలీ జాతీయవాదం- అన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి అని తెలిపారు.