చేసింది చెప్పుకోలేకే ఓడిపోయినం: కేటీఆర్

చేసింది చెప్పుకోలేకే ఓడిపోయినం: కేటీఆర్
  •     బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్
  •     చిన్నచిన్న కారణాలతో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు దూరమయ్యారు
  •     ఇప్పుడు నిజం తెలుసుకొని బాధపడ్తున్నారని కామెంట్

నల్గొండ, వెలుగు :  తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్లే  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్  వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో దేశంలోనే అత్యధికంగా 1,60,283  ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి కూడా నిరుద్యోగుల మనసులు గెలుచుకోవడంలో విఫలమయ్యామని ఆయన పేర్కొన్నారు. సోమవారం నల్గొండలో జరిగిన పార్లమెంట్​ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్  మాట్లాడారు.   ప్రభుత్వ ఉద్యోగులకు గత తొమ్మిదేండ్లలో 73 శాతం జీతాలు పెంచామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ జీతాలు ఇచ్చామన్నారు. కానీ, ప్రతినెలా ఒకటి, రెండు, మూడు తేదీల్లో జీతాలు రావడం లేదని పంతానికి పోయి ఉద్యోగులు తమకు దూరమయ్యారని చెప్పారు. ఇక రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్​ వంటి పథకాలు అందజేసినా తమకు ఓటు వేయలేదని తెలిపారు.

ఇలా ప్రతి వర్గం ఏదో ఒక సమస్య, కారణంతో బీఆర్ఎస్ కు ఓటు వేయలేదన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోవడానికి ప్రజలు కారణం కాదు. కేసీఆర్​ అసలే కాదు. ఇక్కడ వేదిక మీద కూర్చున్న మనమే బాధ్యులం. ఏ పని పడితే ఆ పని చేసుకుంటూ పోయామే తప్ప దాని గురించి ప్రజలకు వివరించడంలో ఫెయిల్​ అయ్యాం. ఇదే తప్పు లోక్ సభ ఎన్నికల్లో జరగడానికి వీల్లేదు. మరోసారి మోసపోరాదు’’ అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. తాము ప్రజల సంక్షేమం కోసం ఎంత చేసినా కాంగ్రెస్  నేతలు చెప్పిన అబద్ధాలకు జనం మోసపోయారని, ఇప్పుడు నిజం తెలుసుకొని బాధపడుతున్నారని చెప్పారు. ప్రజలకు అర్థమైందన్న  విషయం తమకు అర్థం కావాలన్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ ఇచ్చిన హామీలు వచ్చాయా?  లేదా? అని ఆరా తీయాలని సూచించారు.  

రేవంత్​ను ముంచేది నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలే

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన తమకు లేదని కేటీఆర్  అన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్​ పార్టీలోనే ఏక్​నాథ్​ షిండేలు ఉన్నారని, ఇప్పటికే నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ చెవులో గుసగుసలాడుతున్నారని పేర్కొన్నాడు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని, బీజేపీకి బీఆర్ఎస్​ ‘బి’ టీమ్  అని ఆరోపణలు చేసిన రేవంత్​ రెడ్డే ఇప్పుడు బీజేపీతో అంటకాగుతున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలయ్యాక రేవంత్​ బీజేపీతో చేతులు కలపడం గ్యారంటీ అని కేటీఆర్  చెప్పారు. మాజీ మంత్రి జగదీష్  రెడ్డి మాట్లాడుతూ పార్టీ నుంచి చెత్తంతా పోయిందన్నారు. కొత్త నాయకులను తయారు చేసుకోవడం కేసీఆర్​కు కొత్త కాదన్నారు.