
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అబద్ధాల బాద్‌షా అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. వేల కోట్లతో ఎమ్మెల్యేలను కొన్నట్టు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కడుతోందన్నారు. మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు ఆ పార్టీ బట్టేబాజ్ తనం ఓడిపోవడం ఖాయమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ ఆకాంక్షలను ఢిల్లీ పాదుషాలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరన్న సంగతి మునుగోడు ప్రచార సభలో అమిత్ షా ప్రసంగంతో రుజువైందన్నారు. రైతు పక్షపాతి అయిన కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అని విమర్శించడాన్ని చూస్తే హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని విమర్శించారు. కేసీఆర్ తెచ్చిన రైతుబంధును పీఎం కిసాన్‌గా పేరు మార్చి కేంద్రం అమలు చేస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నల్ల చట్టాలతో రైతులకు ఉరి బిగించాలని చూసిన మోడీ సర్కారు, ఇప్పుడు విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రకు తెరతీసిందని ఆరోపించారు.
గుజరాత్‌లో ఫసల్ బీమా ఎందుకు లేదు?
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా స్కీం మంచిదే అయితే అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలను దేశ సంపదను దోచిపెట్టేందుకే ఆ పథకం తెచ్చారే తప్ప, దాంతో రైతులకు ప్రయోజనం లేదన్నారు. ఐదేండ్లలో రూ.40 వేల కోట్ల లాభాలు ఈ పథకం ద్వారా ఆయా కంపెనీలు ఆర్జించాయనేది నిజం కాదా అని అన్నారు. బీహార్, జార్ఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా ఏడు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు కావడం లేదని తెలిపారు.
వడ్లు కొనకుండా తెలంగాణ రైతులను గోస పెడుతున్న బీజేపీ మాటలను ఎవ్వరూ నమ్మబోరన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి ఉచిత కరెంట్‌ను కబళించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా నికృష్ణ రాజకీయాలు చేస్తున్నారని, ప్రాజెక్టులను నిలిపి వేయడానికి బోర్డులు పెట్టి బోడి పెత్తనం చేలాయిస్తున్నారన్నారు. దేశంలోని అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తున్న మోడీ సర్కారు.. చేనేతలపై జీఎస్టీ వేసి ఆ రంగం నడ్డి విరుస్తోందన్నారు.