ఏకపక్షంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు

ఏకపక్షంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కారు నిర్వహించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ‘‘ వాస్తవానికి అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యక్రమం.  బీజేపీ, టీఆర్ఎస్ లకు సంబంధించిన కార్యక్రమం కానే కాదు’’ అని వ్యాఖ్యానించారు. భారతదేశం ఫెడరల్ రిపబ్లిక్ అని.. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే కేంద్రం ముందుకోవాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ లో ‘సౌత్ ఫస్ట్ కాంక్లేవ్ ’ ఆధ్వర్యంలో ‘ఇండియా ద లాస్ట్ ద స్పిరిట్ ఫెడరలిజం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. దేశ అభివృద్ధికి వినియోగిస్తున్న నిధుల్లో 34 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచి అందుతున్నాయన్నారు. రాష్ట్రాలు పన్నులు చెల్లించకుండా.. కేంద్రానికి ఆదాయం ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు.

‘‘నేను ఇస్తున్నాను..’’  అనే యాటిట్యూడ్ తో కేంద్ర సర్కారు వ్యవహరించడం సరికాదన్నారు. ‘‘ రాష్ట్ర సర్కారు ఏం చేయాలి ? ఏం చేయొద్దు ? అనే విషయాన్ని కేంద్రం చెప్పొద్దు. మా రాష్ట్రమూ ధనిక రాష్ట్రమే’’ అని కేటీఆర్ కామెంట్ చేశారు. ‘‘ఈమధ్యకాలంలో కేంద్ర అర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రంలోని ఒక విలేజ్ కి వచ్చారు. అక్కడి రేషన్ షాపులో నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని ఆమె అడిగారు. అలా అడగడం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా ?’’ అని ప్రశ్నించారు. ‘‘మెడికల్ కాలేజీలకు మోడీ పేరు పెడుతున్నారు. స్టేడియంలకు మోడీ పేరు పెడుతున్నారు. కరెన్సీపైన కూడా గాంధీ ఫోటో తొలగించి మోడీ పెడతారని వార్తలు వస్తున్నాయి’’ అని చెప్పారు. ‘‘ ఆయా రాష్ట్రాలు అక్కడి స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాయి.  కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే డైరెక్టరుగా నిధులు మంజూరు చేస్తూ.. పనులు చేయిస్తామంటోంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,  తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.