ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి..ఏడు శాతం మందే  ఫారాలు తిరిగి సమర్పించారు: కేటీఆర్

ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి..ఏడు శాతం మందే  ఫారాలు తిరిగి సమర్పించారు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఎస్‌‌‌‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో బీఎల్వోలు విఫలమవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఎల్వోలు పంపిణీ చేసిన ఎస్‌‌‌‌ఐఆర్ ఫారాలను ఇప్పటివరకు కేవలం 7 శాతం మంది మాత్రమే నింపి సమర్పించారని, జూలై 24 చివరి తేదీలోగా మిగిలిన 93 శాతం ప్రక్రియ పూర్తవుతుందనే నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.

పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్‌‌‌‌ఐఆర్ గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌‌‌‌ఐఆర్) ప్రక్రియపై ఆయన సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌లో పార్టీ నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, జిల్లాల్లో డూప్లికేట్ ఓట్లపై దృష్టి సారిస్తున్న ఎన్నికల కమిషన్, ఒకే వ్యక్తి పేరు వివిధ రాష్ట్రాల ఓటరు జాబితాల్లో ఉన్న అంశాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు. ఇదే డిమాండ్‌‌‌‌తో త్వరలోనే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌‌‌‌ను కలుస్తుందని వెల్లడించారు. బీఆర్ఎస్ తరఫున నియమించిన బీఎల్‌‌‌‌ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 93కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్‌‌‌‌ఏలకు అవగాహన సమావేశాలు నిర్వహించామని, మిగిలిన వాటిలో కూడా త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, ఎస్‌‌‌‌ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణ కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సభ్యులకు ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ ఎల్. రమణకు కరీంనగర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్‌‌‌‌కు నల్లగొండ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌‌‌‌కు రంగారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్‌‌‌‌కు ఖమ్మం, మన్నె క్రిశాంక్‌‌‌‌కు మెదక్, వై. సతీష్ రెడ్డికి వరంగల్, అభిలాష్ రంగినేనికి మహబూబ్‌‌‌‌నగర్, ముజీబ్‌‌‌‌కు ఆదిలాబాద్, సుమిత్రానంద్‌‌‌‌కు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బాధ్యతలను అప్పగిస్తూ, ఎస్‌‌‌‌ఐఆర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేటీఆర్ ఆదేశించారు.