బీఆర్ఎస్‌‌‌‌కు మద్దతు ఇవ్వండి: ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలకు కేటీఆర్ పిలుపు

బీఆర్ఎస్‌‌‌‌కు మద్దతు ఇవ్వండి: ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐలకు కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌ను గెలిపించేందుకు ఎన్ఆర్ఐలు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం 52 దేశాల ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో ఆయన మాట్లాడారు.​ తెలంగాణ నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్నా.. ఇక్కడ ఏం జరుగుతుందనే ఆసక్తి మీలో ఉందన్నారు. 2004 నుంచి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఎన్ఆర్ఐలు కలిసి వచ్చారని గుర్తుచేశారు.

 తొమ్మిదేండ్లలో తమ ప్రభుత్వం విద్య, వైద్యంతో పాటు ఇతర రంగాల్లో అందిస్తున్న సేవలు దేశానికే రోల్​మోడల్‌‌‌‌గా నిలిచాయని చెప్పారు. 2013–14లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.93,151గా ఉంటే, ఇప్పుడు రూ.3,12,398కి చేరిందన్నారు. ఐటీ ఎగుమతులు 264 శాతం పెరిగాయని, ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.71 లక్షల నుంచి 9.05 లక్షలకు పెరిగిందని తెలిపారు. రాబోయే నెల రోజులు తెలంగాణకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. 

ఒకనాడు తెలంగాణను కాంగ్రెస్​ఆంధ్రాలో కలిపితే 60 ఏండ్లు అనేక బాధలు పడ్డామని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే 50 ఏండ్లు వెనక్కి పోతామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రం ఎలా ఉండేది.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. 

ఎన్ఆర్ఐలు తమ గ్రామాలతో పాటు మీ బంధువులు, స్నేహితులతో మాట్లాడాలని, సోషల్ మీడియాలో కూడా రాష్ట్ర అభివృద్ధిపై ప్రజలకు వివరించాలని సూచించారు. అవకాశం ఉన్నవాళ్లు తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, అనిల్ కూర్మాచలం, మహేశ్ తన్నీరు తదితరులు పాల్గొన్నారు.