మొక్కలు బతక్కపోతే కౌన్సిలర్లు ఔట్

మొక్కలు బతక్కపోతే కౌన్సిలర్లు ఔట్

నాలుగేండ్లు గట్టిగా పనిచేస్తం
ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ : మంత్రి కేటీఆర్
మహబూబ్ నగర్ నుంచి ‘పట్టణ ప్రగతి’కి శ్రీకారం

మున్సిపాలిటీల్లోని వార్డుల్లో నాటిన మొక్కల్లో 85శాతం వరకు బతకాలని, ఆ బాధ్యత  కౌన్సిలర్లదేనని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.  మొక్కలు బతుకకపోతే కౌన్సిలర్ల పదవులు పోతాయని హెచ్చరించారు. ‘‘బల్దియా అంటే.. ఖాయా, పీయా, చల్దియా అనే అపవాదు ఉంది. ఆ బద్నాం పోవాలి. ప్రజల్లో మంచిపేరు తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యం” అని చెప్పారు.  పట్టణాల్లో చెట్ల శాతం భారీగా తగ్గిపోతోందని అన్నారు. సోమవారం మహబూబ్​నగర్​లో ఆయన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సభలో కేటీఆర్​ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఏ ప్రభుత్వం  కూడా పనిచేయలేదని, ఏ పథకం కూడా విజయవంతం కాదని అన్నారు.  పట్టణ ప్రగతి వెనుక ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని  స్పష్టం చేశారు.

‘‘ఇది పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేస్తున్నదే తప్ప రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నది కాదు. ఇది ఎన్నికల టైం కాదు..  అన్ని ఎన్నికలు అయిపోయినయ్. ఈ నాలుగేండ్లు గట్టిగా పనిచేసి ప్రజల మనసు దోచుకోవడమే మా ఎజెండా” అని ఆయన తెలిపారు.  గతంలో మున్సిపాలిటీలంటేనే ఒక చెడ్డ పేరుండేదని, అది మారాలన్నారు. ఎంత మంది నిరక్షరాస్యులు ఉన్నారో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్వే చేపడుతామని, రాష్ట్రాన్ని 100శాతం అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను ఈజీగా వచ్చేందుకు  ఏప్రిల్​ 2 నుంచి టీఎస్​ బీపాస్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మాట్లాడుతూ పట్టణ ప్రగతిని పాలమూరు నుంచే ప్రారంభించినందుకు కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్​రెడ్డి, కలెక్టర్​ వెంకట్​రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి కేటీఆర్​ మహబూబ్ నగర్​లోని మెట్టుగడ్డ  డైట్ కాలేజీ వద్ద  వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ పనులకు ప్రారంభోత్సవం చేశారు.

డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇప్పించండి సారూ..!

మహబూబ్‌నగర్‌‌ పట్టణంలో మంత్రి కేటీఆర్‌‌ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఆయన పలుకరించారు. తమకు డబుల్​ ఇండ్లు కావాలంటూ మంత్రిని అక్కడి మహిళలు కోరారు. పాతతోట వీధిలో ఇంటి బయట కూర్చొని ఉన్న వెంకటమ్మ అనే వృద్ధురాలి వద్దకు కేటీఆర్​ వెళ్లి.. ‘‘అవ్వా  మంచిగున్నవా?  పెన్షన్  వస్తుందా.. మీ ఇంటికి నల్లా నీళ్లు వస్తున్నయా..? మున్సిపాలిటీ నుంచి చెత్తబుట్టలు ఇచ్చిండ్రా” అనిఅడిగారు. వెంకటమ్మ మాట్లాడుతూ .. ‘‘నాకు ఒకే కూతురు ఉంది. ఆమె ఇల్లు లేదు.  డబుల్ ఇల్లు ఇప్పించండి సారూ..” అని వేడుకుంది. మరో వీధిలో కూడా కొందరు మహిళలు ఇండ్లు కట్టివ్వాలని కోరారు. తప్పకుండా కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేటీఆర్​ మంగళవారం నల్గొండ జిల్లా దేవరకొండలో, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పర్యటించనున్నారు.