
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మల్లా ఆడిస్తోందని మండిపడ్డారు. ‘‘ ఈసీ (ఎన్నికల కమిషన్) కంటే ముందే.. ఎన్నికల తేదీలను బీజేపీ ప్రకటిస్తుంది. ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కంటే ముందే.. దాడులు ఎదుర్కోబోయే నాయకుల చిట్టాను బీజేపీ వెల్లడిస్తుంది. ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) కంటే ముందే.. నిషేధాలు ఎదుర్కోబోయే సంస్థల గురించి బీజేపీ ప్రకటన చేస్తుంది. ‘ఐటీ’ (ఆదాయపు పన్ను విభాగం) కంటే ముందే.. దాడుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు గురించి బీజేపీ కామెంట్లు చేస్తుంది. ‘సీబీఐ’ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కంటే ముందే.. కేసుల్లోని నిందితుల గురించి బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది’’ అని కేటీఆర్ ఆరోపించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈవిధంగా దుర్వినియోగం చేస్తున్న బీజేపీ పార్టీ పేరును మార్చుకోవాలని సూచించారు. బీజేపీకి కొత్తగా ‘‘బీజే –ఈసీ– సీబీఐ– ఎన్ఐఏ– ఐటీ– ఈడీ– పీ’’ అని నామకరణం చేసుకోవాలన్నారు. ఈ ట్వీట్ కు ఓ పత్రికలో ప్రచురితమైన న్యూస్ క్లిప్ ను అటాచ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు అక్టోబరు 15లోపు నోటిఫికేషన్ వెలువడుతుందని బీజేపీ స్టీరింగ్ కమిటీ భేటీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చేసిన కామెంట్ తో ప్రచురితమైన న్యూస్ క్లిప్ అది.