లోక్ సభలో TRS కీలకం కాబోతుంది : కేటీఆర్

లోక్ సభలో TRS కీలకం కాబోతుంది : కేటీఆర్

కరీంనగర్‌ : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో TRS సత్తాచాటుతుందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 ఎంపీ స్థానాల్లో TRS గెలిస్తే.. ఢిల్లీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకం కానుందని తెలిపారు. కరీంనగర్‌ లో నిర్వహించిన జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ‘2014 సాధారణ ఎన్నికల్లో TRS పార్టీ తరపున 11 మంది సభ్యులను గెలిపించి లోక్‌ సభకు పంపించాం. నాటి ఎన్నికల్లో మోడీ అంటే ఓ భ్రమ. దేశాన్ని ఉద్దరిస్తాడు అని BJP కి 283 సీట్లను కట్టబెట్టారు. నాడు ఎవరి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. NDA ప్రభుత్వం ఈ ఐదేండ్ల కాలంలో ఏం అభివృద్ధి చేయలేదు.

త్వరలో జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో BJPకి 150 సీట్లు వచ్చేది కష్టమే. కాంగ్రెస్‌ కు 100 నుంచి 110 సీట్లు వచ్చేది కష్టమే. ఈ రెండు కలిపితే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. రేపటి రోజున మొత్తం 16 ఎంపీ స్థానాల్లో TRSను గెలిపిస్తే.. ఢిల్లీ గద్దె మీద మనం కీలకం కాబోతున్నాం. దీంతో ఎవరూ ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే శక్తి మనకు ఉంటుంది. రాహుల్‌, మోడీ దొందూ దొందే అని ప్రజలకు తెలిసిపోయింది. వీరిద్దరూ ఎద్దెవా చేసుకున్నదే తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు. ఢిల్లీలో ప్రబలమైన శక్తిగా ఉంటే తప్ప మన హక్కులు సాధించుకోలేం. మన 16 మంది ఎంపీలకు.. మరికొంత మంది తోడు అవుతారనే నమ్మకం ఉంది.

భావసారూప్యత కలిగిన పార్టీలన్ని కలిసి 70 స్థానాలకు తగ్గకుండా.. 100 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయి. మొత్తంగా 100 స్థానాలతో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉంది. KCR లాంటి మేధోసంపత్తి గల నాయకుడు.. ఏ విధంగానైతో తెలంగాణలో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారో.. ఆ విధంగా కేసీఆర్‌ నేతృత్వంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. BJP, కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ KCR కు మద్దతుగా నిలుస్తాయి. లోక్‌ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీ గద్దె మీద మనమే కీలకం కాబోతున్నామని అని తెలిపారు కేటీఆర్‌.