- ప్రభుత్వం, స్పీకర్, మండలి చైర్మన్ ఒప్పుకోవాలి: కేటీఆర్
- కాంగ్రెస్ నేతలు ఓటు కోసం కోటి మోసాలు చేస్తున్రు
- సీఎం తొలి సంతకం చేసిన ఫైల్‌ను వెతికి పట్టుకుంటమని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి అడ్డగోలుగా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని వర్గాలనూ మోసం చేసిందని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్విమర్శించారు. 800 రోజులైతున్నా ఆరు గ్యారంటీలకు అతీగతీ లేదని, ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా అమలు కాలేదన్నారు. అందుకే వాటిని అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్తరఫున ఈ నెల 27న ప్రైవేట్మెంబర్బిల్లు పెడతామన్నారు. మండలి చైర్మన్, స్పీకర్‌ను కలిసి బిల్లును ఆమోదించాలని కోరుతామన్నారు. ప్రైవేట్‌మెంబర్ బిల్లుపై పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, న్యాయనిపుణులతో శనివారం ఆయన తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లంటూ అడ్డగోలుగా హామీలిచ్చి నాలుగు కోట్ల మందికి టోపీ పెట్టిందన్నారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో అని విమర్శించారు. గ్యారంటీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లును అనుమతించాలని డిమాండ్‌చేశారు. గతంలో ఎన్టీఆర్ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తుచేశారు.
ఆ ఫైలును వెతికి పట్టుకుంటం
సీఎం రేవంత్తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఇప్పటికీ దొరకడం లేదని, దాన్ని వెతికి పట్టుకుంటామని కేటీఆర్ అన్నారు. సీఎం సంతకం పెట్టిన ఫైల్దొరక్కుండా పోవడమేంటని ప్రశ్నించారు. ‘‘ఆ ఫైలు ఏమైంది? రానుపోను ఢిల్లీ విమానంలో ఎక్కడైనా పోగొట్టారా? లేదంటే ఎఫ్ఎస్ఎల్అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? లేదంటే మొదటి సంతకమే మోసంతో ప్రారంభమైందా? రాష్ట్ర ప్రజలకు న్యాయం కోసమే మేము ఆరుగ్యారంటీల అమలుపై పట్టుబడుతున్నం. గ్యారంటీలకు చట్టబద్ధత వస్తే వాటిపై ఎవరికీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
ఎవరికీ దండాలు పెట్టే పని లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా ఎట్లైతే జీతాలిస్తదో, ఆరు గ్యారంటీలకు చట్టం చేస్తే రూ.4 వేల పెన్షన్, మహిళలకు రూ.2500, రైతులకు రూ.15 వేలు, విద్యార్థులకు రూ.5 లక్షల వంటివన్నీ వస్తాయి. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కచ్చితంగా మేలైతది. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా ఉపయోగించుకుంటం’’ అని కేటీఆర్ అన్నారు.
