కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ

కేంద్రమంత్రులకు కేటీఆర్ లేఖ
  •     మళ్లీ తెరవండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి కేటీఆర్​
  •     కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, మహేంద్రనాథ్​కు లెటర్​
  •     అవసరమైన అన్ని సౌలతులూ ఉన్నాయని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ఆదిలాబాద్​లో సిమెంట్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) యూనిట్​ను మళ్లీ తెరవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్​ కోరారు. ఆదివారం ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, మహేంద్ర నాథ్​లకు లేఖ రాశారు. సిమెంట్​ ఫ్యాక్టరీ నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 772 ఎకరాల స్థలం, 170 ఎకరాల టౌన్​షిప్​, 1,500 ఎకరాల్లో 4.9 కోట్ల టన్నుల లైమ్​ స్టోన్​ నిల్వలు, 2 కేవీఏ కరెంట్​ సరఫరా, నీటి లభ్యత వంటి అన్ని వనరులూ అందుబాటులో ఉన్నాయని వివరించారు. యూనిట్​ను తిరిగి ప్రారంభిస్తే గిరిజనులు, ఆదివాసీ యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని దేవాపూర్​లో ఓరియంట్​ సిమెంట్​ ప్లాంట్​ ఉత్పత్తి కెపాసిటీని రెట్టింపు చేసేందుకు రూ.1,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టారని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశమంతటా సిమెంట్​కు డిమాండ్​ పెరిగే అవకాశముందన్నారు. సిమెంట్​ ఉత్పత్తి, వాడకంలో దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, మరిన్ని సిమెంట్​ కంపెనీలను ప్రారంభిస్తే మన దేశ స్థానం మరింత పటిష్టం అవుతుందని అన్నారు. దాని వల్ల మున్ముందు అరబ్​, ఆఫ్రికా దేశాలకు సిమెంట్​ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిమెంట్​ కంపెనీని పునరుద్ధరించాలని కోరారు. దీనిపై గతంలోనూ పలుమార్లు కేంద్రానికి వినతిపత్రాలు అందజేశామని, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు.

రైతు బంధు సంబురాలు చెయ్యాలె
రైతుల ఖాతాల్లో ఈ నెల 10వ తేదీ నాటికి రైతుబంధు కింద రూ.50 వేల కోట్లు జమ కానున్నందున టీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌‌‌‌ పిలుపునిచ్చారు. 70 ఏండ్ల స్వాతంత్ర్య భారతంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసి రైతులను ఆదుకున్నది సీఎం కేసీఆర్‌‌‌‌ తప్ప మరెవరూ లేరన్నారు. దీంతో ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజులు సంబురాలు చేసుకుందామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌‌లో మంత్రి నిరంజన్‌‌ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డిలతో కలిసి టెలి కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. రైతుబంధు సంబురాలపై టీఆర్ఎస్‌‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, రైతుబంధు అధ్యక్షులు, డీసీఎంస్‌‌ చైర్మన్లకు దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెరువుల బలోపేతం వరకు.. రైతుబంధు, రైతు బీమా నుంచి రైతు వేదికల వరకు కనీవినీ ఎరుగని గొప్ప కార్యక్రమాలు సీఎం కేసీఆర్‌‌‌‌ చేశారు. రైతుబంధు కింద రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని సెలబ్రేట్‌‌ చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు. రైతుబంధుపైన ఉపన్యాస, వ్యాస రచన, పెయింటింగ్‌‌ పోటీలు నిర్వహించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రైతుబంధుపై ముగ్గులు వేసేలా మహిళలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రామంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపులతో మొదలుపెట్టి రాష్ట్రంలోని 2,600కు పైగా ఉన్న రైతు వేదికల వద్ద ఈ నెల10న ఘనంగా రైతుబంధు ముగింపు సంబురాలు చేయాలని చెప్పారు. 63 లక్షల మంది రైతులకు రైతుబంధు అందిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచంలోనే లేదని మంత్రి నిరంజన్‌‌రెడ్డి తెలిపారు.