- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
- ప్రభుత్వానికి ఒక్కరోజే టైమ్ ఇస్తాం.. ఆ తర్వాత రోడ్లు ఎక్కుతాం
- నాట్లప్పుడు కాకుండా.. ఓట్లప్పుడు రైతు భరోసా ఇస్తున్నారని ఫైర్
- వరంగల్, జనగామ జిల్లాల్లో మాజీ మంత్రి పర్యటన
జనగామ/వరంగల్/నర్సంపేట, వెలుగు: 'రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ఈ ఒక్కరోజే టైమ్ ఇస్తున్నాం. కొనుగోలు చేయకుంటే అందరం కలిసి రోడ్లు ఎక్కుతాం. రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్హెచ్చరించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి జనగామ జిల్లా యశ్వంతాపూర్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా సెంటర్లో పలువురు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైతు భరోసా వచ్చిందా.? రూ.2 లక్షలు రుణమాఫీ అయిందా..? అని ప్రశ్నించారు. మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడి వెంటనే మక్కల కొనుగోలు ప్రారంభించాలని, లేకుంటే రైతులు ఆగమవుతారని చెప్పారు. అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలు కొనుగోలు చేసే నాథుడే లేడన్నారు.
45 లక్షల టన్నుల మక్కల దిగుబడి వస్తే ఇప్పటివరకు 6 లక్షల టన్నులే కొనుగోలు చేశామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా నాట్లు వేసే సమయంలో కాకుండా ఓట్లు వేసే టైమ్లో ఇస్తున్నారని విమర్శించారు. పంటలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలి..
రాష్ట్రంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్‍లో జరిగిన కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‍రెడ్డితో కలిసి కేటీఆర్ వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్లను సందర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్‍లో రేవంత్‍రెడ్డి సర్కార్ చేసిన కుంభకోణం, అవినీతి వల్ల బయట రూపాయి అప్పు పుట్టడంలేదని, రూ.లక్షా 6 వేల కోట్ల అప్పు పెట్టి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ను ముంచేశారని ఆరోపించారు. మార్క్ఫెడ్ ద్వారా రూ.22,700 కోట్ల అప్పు తీసుకుని వాటిని మక్కలకు ఇవ్వకుండా వడ్ల కొనుగోలుకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం ముత్తోజీపేట గ్రామానికి వెళ్లి ఇటీవల ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
