చేనేత కార్మికులను ఆదుకోండి..సీఎం రేవంత్‌‌‌‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

చేనేత కార్మికులను ఆదుకోండి..సీఎం రేవంత్‌‌‌‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ కక్షపూరిత వైఖరితో  నేతన్నలు ఉపాధి కోల్పోయారని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. ఉపాధి దొరక్క, అప్పులు, ఆకలి బాధలు తట్టుకోలేక, ఆత్మగౌరవం చంపుకోలేక నేతన్నలు తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా పది మంది నేతన్నలు తనువు చాలించారన్నారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని కోరారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90 శాతం సబ్సిడీని వెంటనే అమలు చేయాలని చెప్పారు. బతుకమ్మ చీరలు, అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు సంబంధించి ఆర్డర్ ను నేతన్నలకు ఇవ్వాలన్నారు. 

ఎన్ డీఏ అంటే నేషనల్ డిజాస్ట్రస్ అలయన్స్‌‌‌‌

ఎన్‌‌‌‌డీఏ అంటే నేషనల్ డిజాస్ట్రస్ అలయన్స్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్‌‌‌‌డీఏ సర్కార్ హయాంలో నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని, యూజీసీ నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలిపారు.  సీఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌– యూజీసీ నెట్ ఎగ్జామ్, నీట్ పీజీ ఎగ్జామ్ పోస్ట్‌‌‌‌ పోన్ అయిందని చెప్పారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. నీట్ పేపర్ లీక్ విషయం స్పష్టంగా, ఆధారాలతో సహా బయటపడుతుంటే, మరోపక్క కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.