
హైదరాబాద్, వెలుగు: వీఆర్ఏల సమస్యలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెగేదాకా లాగొద్దని, సమ్మెను విరమించి విధుల్లో చేరాలని వీఆర్ఏ సంఘాల జేఏసీ నాయకులకు సూచించారు. పేస్కేల్, అర్హులకు ప్రమోషన్లు, వారసులకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 13న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వేలాది మంది వీఆర్ఏలు తరలిరావడంతో వారిని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చర్చలకు పిలిచారు. అయితే, ఆ రోజు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని మెట్రో రైల్ భవన్‌లో మరోసారి మంత్రి కేటీఆర్ వీఆర్ఏ జేఏసీ నాయకులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తమ డిమాండ్లను జేఏసీ నాయకులు మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నాయకులు వెల్లడించారు. మీ డిమాండ్లు న్యాయమైనవేవేనని, రెండేండ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నారని మంత్రి అన్నట్లు జేఏసీ నేతలు చెప్పారు. అన్ని సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరలో జరగబోయే కేబినేట్ సమావేశంలో అప్రూవల్ తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. ఇందుకు 15, 20 రోజులు పట్టొచ్చని, తన మీద నమ్మకం ఉంచి సమ్మె విరమించాలని మంత్రి కోరినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు.
సమ్మె కొనసాగింపుపై సందిగ్ధత..
సమ్మె విరమరణపై వీఆర్‌ఏ జేఏసీ నాయకులు సందిగ్ధంలో పడ్డారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని, మరో 15, 20 రోజుల గడువు విధించడంతో.. సమ్మె కొనసాగించాలా వద్దా అనే విషయమై సమాలోచనలు జరిపారు. మంత్రి మాటపై నమ్మకంతో సమ్మె విరమిద్దామని కొందరు అనగా, సమ్మె కొనసాగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలిసింది. సమ్మె కొనసాగించే విషయంలో బుధవారం హైదరాబాద్‌లో అన్ని జిల్లాల జేఏసీ చైర్మన్లతో చర్చలు జరిపి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జేఏసీ కోకన్వీనర్ వంగూరు రాములు తెలిపారు.