
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అత్యధిక విజయాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అనేక అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను అధిగమించి క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి ప్రపంచమే అబ్బురంగా తెలంగాణ వైపు చూసేలా చేశామన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ఎన్‌ఐఆర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాధించిన విజయంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే వేదికపై పసికూనలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిచయం చేశానని, ఈ ఏడేళ్లలో రాష్ట్రం సక్సెస్ స్టోరీని అందరితో షేర్ చేసుకోవడానికి మళ్లీ వచ్చానని తెలిపారు. భౌగోళికంగా దేశంలో 11వ రాష్ట్రమైన తెలంగాణ.. దేశానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగో వాటాదారు అని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, ఇండస్ట్రీస్‌కు నిరంతరాయం కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు.
దేశానికే ధాన్యాగారం
కాళేశ్వరం లాంటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలోనే పూర్తి చేశామని కేటీఆర్ చెప్పారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంతో దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో 19 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం నలుమూలలా ఐటీ ఇండస్ట్రీని విస్తరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ‘మన ఊరు – మన బడి’ పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు. పుట్టినగడ్డకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, తమ గ్రామాల్లోని బడిని దత్తత తీసుకోవాలని సూచించారు. తర్వాత ‘ఇన్‌క్లూజివ్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్’ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ నాగేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ డెవలప్‌మెంట్ మోడల్‌ను కేటీఆర్ వివరించారు.