కేయూ హాస్టళ్లలో నిధుల గోల్‌‌మాల్?.. మాజీ డైరెక్టర్‌‌ తో పాటు 18 మందికి షోకాజ్ నోటీసులు

కేయూ హాస్టళ్లలో నిధుల గోల్‌‌మాల్?.. మాజీ డైరెక్టర్‌‌ తో పాటు 18 మందికి షోకాజ్ నోటీసులు

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్ల నిర్వహణలో నిధుల గోల్‌‌మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. వర్సిటీ మెస్ నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘాలు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన యూనివర్సిటీ అధికారులు హాస్టళ్ల మాజీ డైరెక్టర్ డాక్టర్​ ఎల్పీ రాజ్‌‌కుమార్‌‌తో పాటు మరో 17 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

హాస్టల్ నిర్వహణ పనుల కోసం జాయింట్ డైరెక్టర్లకు అడ్వాన్సుల రూపంలో హాస్టల్ కార్యాలయం నుంచి లక్షల రూపాయలు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ నిధుల్లో కొంత మొత్తాన్ని మాజీ హాస్టల్ డైరెక్టర్ డాక్టర్​ ఎల్పీ రాజ్‌‌కుమార్ తన వ్యక్తిగత ఖాతాలోకి ఫోన్‌‌పే ద్వారా బదిలీ చేయించుకున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు గతంలో ఆరోపించారు. 

ఈ ఆరోపణల నేపథ్యంలో నియమించిన విచారణ కమిటీ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. అడ్వాన్సుల పేరుతో సుమారు రూ.20 లక్షలకు పైగా చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే దొంగ బిల్లుల ద్వారా హాస్టల్ నిధులు దారి మళ్లించినట్లు కూడా గుర్తించినట్లు సమాచారం.

అడ్డా లేబర్ల పేరుతోనూ..

అదనంగా అడ్డా లేబర్ల పేరిట కూడా అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పనులకు సంబంధించి వైస్‌‌ చాన్సలర్, రిజిస్ట్రార్ అనుమతులు లేకుండానే టెండర్లు నిర్వహించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆమోదం లేకుండానే కోట్ల రూపాయల విలువైన కిరాణా సామగ్రి కొనుగోలు చేసినట్లు కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ నిధుల గోల్‌‌మాల్ వ్యవహారంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ 18 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.