వరంగల్  బంద్  ప్రశాంతం.. నగరంలో భారీగా పోలీసు బలగాలు

వరంగల్  బంద్  ప్రశాంతం.. నగరంలో భారీగా పోలీసు బలగాలు
  • పీహెచ్​డీ అక్రమాలకు నిరసనగా పిలుపునిచ్చిన కేయూ స్టూడెంట్ జేఏసీ
  • కేయూ వద్ద విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం 

హనుమకొండ, వరంగల్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ పీహెచ్ డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళన చేయడం, పోలీసుల అరెస్ట్​, దాడి, వర్సిటీలో ఇతర పరిణామాలను నిరసిస్తూ కేయూ స్టూడెంట్ జేఏసీ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్​కు పిలుపునివ్వగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం వర్సిటీలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వరంగల్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి, వీసీ రమేశ్​, రిజిస్ట్రార్ శ్రీనివాసరావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంద బంద్ పాటించగా..మరికొన్నింటిని విద్యార్థి సంఘాల నేతలు మూసేయించారు. బంద్ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీలోని మెయిన్ జంక్షన్లలో భారీగా బలగాలను మోహరించారు. బంద్ కు పిలుపునిచ్చినా నడుస్తున్న విద్యాసంస్థల బస్సులను స్టూడెంట్ లీడర్స్ అడ్డుకున్నారు. విద్యార్థులను ఇండ్లకు పంపించారు.

కేయూ ఎస్డీఎల్సీఈ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ప్రైవేటు బస్సులను తిరిగి పంపిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, కేయూ, ఎల్కతుర్తి సీఐలు అబ్బయ్య, ప్రవీణ్ కుమార్ బందోబస్తును పర్యవేక్షించారు. సాయంత్రం వరకు బంద్​నిర్వహించిన విద్యార్థి సంఘాల నేతలు తర్వాత ఎస్​డీఎల్​సీఈ వద్ద నిరసన దీక్ష కొనసాగించారు.

వీసీ, రిజిస్ట్రార్​ ను తొలగించాలి: కేయూ స్టూడెంట్​ జేఏసీ

పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడిన వీసీ రమేశ్​, రిజిస్ట్రార్​శ్రీనివాసరావును బర్తరఫ్​ చేయాలని కేయూ స్టూడెంట్​లీడర్లు డిమాండ్​ చేశారు. పీహెచ్​డీ అక్రమాలపై విచారణ జరిపి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలన్నారు. ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించడం దారుణమన్నారు. వీసీ రమేశ్​ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.