కూకట్పల్లి చోరీ కేసు చేధించిన పోలీసులు

కూకట్పల్లి చోరీ కేసు చేధించిన పోలీసులు

కూకట్ పల్లి వివేకానంద నగర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాల్ కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 12న వివేకానంద నగర్ కు చెందిన దామోదర్ రావు అనే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డ నేపాల్ గ్యాంగ్ దాదాపు కోటి రూపాయల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దామోదర్ ఇంట్లో పని చేసే సీత భర్త చక్రిని చోరీకి సూత్రధారిగా గుర్తించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వారిపై ఐపీసీ IPC సెక్షన్ 519/2022  u/s 457, 380 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.  

నిందితుని భార్య సీత ఏడు నెలల క్రితం దామోదర్ ఇంట్లో పనికి చేరింది.  ఆ తర్వాత సీత భర్త చక్రి దర్జీ, అతని స్నేహితుడు ప్రదీప్ షాహీ ఒకరి తర్వాత మరొకరు పనికి కుదిరారు.12న దామోదర్ కుటుంబసభ్యులు ఫంక్షన్ కు వెళ్లడంతో ప్రధాన నిందితుడు చక్రి, భార్యతో పాటు ఉపేందర్ యజమాని ఇంట్లో ఉన్న 28.90 లక్షల నగదుతో పాటు 137 తులాల బంగారం చోరీ చేశారు. అనంతరం లక్డీకాపూల్ కు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయాడు. ఈలోగా బాధితుడి ఫిర్యాదుతో కూకట్ పల్లి పోలీసులతో పాటు సీసీఎస్, ఎస్ఓటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

చోరీ చేసిన సొత్తును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దాచిన నిందితులు బెంగళూరుకు పారిపోయారు. ఆ సొమ్ము కోసం నాలుగు రోజుల తర్వాత తిరిగి రావచ్చారు. సికింద్రాబాద్ నుంచి నేపాల్ పారిపోయేందుకు ప్లాన్ చేసుకోగా..  సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి దాదాపు కోటి రూపాయల విలువైన సొత్తు సీజ్ చేశారు. దొంగతనానికి ముందు పూణె వెళ్లిన నిందితులు సీత, చక్రి పది రోజులు అక్కడే ఉండి చోరీకి స్కెచ్ రెడీ చేసుకున్నారు. చక్రి తన ఫ్రెండ్ ఉపేందర్ ను ప్లాన్ గురించి చెప్పారు. అనంతరం హైదరాబాద్ తిరిగొచ్చి ఎర్రగడ్డ మార్కెట్ లో దొంగతనానికి అవసరమైన వస్తువులు కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.